Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ఏ విధంగా పాకిస్తాన్‌ను దెబ్బతీసిందనే వివరాలను ఇప్పుడిప్పుడే అక్కడి నేతలు ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత దాడులు తమ నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌కు నష్టాన్ని కలిగించాయని ఒప్పుకున్నారు. దీంతో పాకిస్తాన్ తొలిసారిగా అధికారంగా అంగీకరించినట్లైంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పాక్ సైన్యం హెడ్‌క్వార్టర్స్ ఉండే రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌ను భారత్ క్షిపణులతో ధ్వంసం చేసింది. ఎయిర్‌బేస్‌ను భారత దాడులు తీవ్రంగా నష్టపరిచాయని, అక్కడ సిబ్బందిని గాయపరిచాయని ఆయన అంగీకరించాడు. భారత సైనిక చర్యల్ని ఇన్నాళ్లు తక్కువ చేసి మాట్లాడిన పాకిస్తాన్, ఇప్పుడు నిజాలను నెమ్మదిగా ఒప్పుకుంటోంది. అంతకుముందు, ఆపరేషన్ సిందూర్ దాడుల సమయంలో తనను బంకర్‌లోకి వెళ్లాలని అధికారులు సూచించారని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పిన వీడియో వైరల్‌గా మారింది.
ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారతదేశం స్వల్ప వ్యవధిలో పాకిస్తాన్ గగనతలంలోకి పెద్ద సంఖ్యలో డ్రోన్‌లను పంపిందని అన్నారు. 36 గంటల్లో భారత్ దాదాపు 80 డ్రోన్లను ఉపయోగించిందని చెప్పారు. పాక్ దళాలు వాటిలో 79 డ్రోన్లను అడ్డగించారని, ఒక డ్రోన్ సైనిక స్థావరాన్ని ఢీకొట్టిందని ఆయన చెప్పారు. ఈ ఒక్క డ్రోన్ తమ సైనిక స్థావరానికి నష్టం కలిగించి, సిబ్బందిని గాయపరిచిందని అతను చెప్పాడు. పాక్ వైమానిక రక్షణ ప్రతిస్పంద చాలా విజయవంతమైందని చెప్పాడు. అయితే, భారత దాడులు పాకిస్తాన్ రక్షణలోకి చొచ్చుకుపోయాయనేది ఈ ప్రకటనతో తెలుస్తోంది.
Read Also: Crime News: చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన వివాహితుడు..
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ రాజకీయ, సైనిక నాయకత్వం మే 9 రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించిందని దార్ అన్నారు. ఈ సమావేశంలో భారత్‌పై దాడికి కీలక నిర్ణయాలు ఆమోదించబడ్డాయని, మే 10వ తేదీ తెల్లవారుజామున నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై దాడి చేయడం ద్వారా భారత్ తప్పు చేసిందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాక్‌లోని 11 ఎయిర్ బేసులపై దాడులు చేసింది. ముఖ్యంగా, పాక్ ఎయిర్ ఫోర్స్‌కు కీలకంగా ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ భారత దాడితో మంటల్లో చిక్కుకుంది. మురిడ్, రఫికీ, సుక్కూర్, రహీంయార్ ఖాన్, సియాల్ కోట్, సర్గోదా, జకోబాబాద్, పస్రూర్, స్కర్దూ, చునియన్ ఎయిర్ బేసులపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో వందకు పైగా పాక్ సైనికులు హతమయ్యారు.