Site icon NTV Telugu

Jammu Kashmir: బుద్ధిమార్చుకోని పాకిస్తాన్.. ఎల్ఓసీ వెంబడి ఉగ్రవాదుల మోహరింపు.. జీ-20 లక్ష్యమా..?

Loc

Loc

Jammu Kashmir: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ తన బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్ లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాకిస్తాన్ ఆర్మీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నియంత్రణ రేఖ(లైన్ ఆఫ్ కంట్రోల్) వెంబడి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్లలో పాక్ సైన్యం పెద్ద ఎత్తు ఉగ్రవాదులను ఉంచినట్లు తెలిసింది. దీంతో భారత సరిహద్దు వెంబడి భద్రతాబలగాలు అప్రమత్తం అయ్యాయి. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం భారత-పాకిస్తాన్ సరిహద్దులోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ఉన్న లాంచ్‌ప్యాడ్ల నుంచి ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు పాక్ ఆర్మీ వేచిచూస్తోంది.

Read Also: Tihar Jail: 90 మంది తీహార్ జైలు అధికారులు ట్రాన్స్‌ఫర్.. గ్యాంగ్‌స్టర్ హత్య తరువాత కీలక పరిణామం

పీఓకేలోని నీలం వ్యాలీ, జీలం వ్యాలీ, లీపా వ్యాలీ లోని లాంచ్‌ప్యాడ్‌ల వద్ద 10-20 మధ్య ఉగ్రవాద గ్రూపులు అదును కోసం వేచి చూస్తున్నాయి. అయితే ఈ పరిణామాలను భారత్ గమనిస్తోంది. ఎల్ఓసీ వెంబడి సైన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల చివరిలో శ్రీనగర్ లో జీ-20 సమావేశం జరగబోతోంది. దీనికి అంతరాయం కలిగించేందుకు పాకిస్తాన్ దుష్టపన్నాగాలు పన్నుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం సహకారంతోనే ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు చూస్తున్నారు. మే 23-24 తేదీల్లో శ్రీనగర్ కేంద్రంగా జీ-20 సమావేశం జరగబోతోంది.

జమ్మూకాశ్మీర్ లో అస్థిరతను, అభద్రతను పెంచేందుకు పాక్ కుయుక్తులు పన్నుతోంది. ఒక వేళ జీ-20 సమావేశం విజయవంతంగా జరిగితే కాశ్మీర్ లో ఎలాంటి మానవహక్కుల ఉల్లంఘన, అశాంతి లేదని అంతర్జాతీయ సమాజానికి సందేశం వెళ్తుంది. అయితే ఇలా జరగకూడదని పాకిస్తాన్ భావిస్తోంది. ఇటీవల ఎస్ సీ ఓ సమావేశానికి గోవా వచ్చిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. జీ-20 సమావేశాన్ని ఉద్దేశించి మనసులో ఉన్న అక్కసు బయటపెట్టాడు. అదును చూసి సమాధానం చెబుతాం అంటూ హెచ్చరించే విధంగా మాట్లాడాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత సైన్యం, కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాద వేటలో నిమగ్నమై ఉన్నారు.

Exit mobile version