Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ దేశ ఆర్మీపై భీకర దాడులు చేసింది. ముందుగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు, టాప్ కమాండర్స్ మరణించారు. ముఖ్యంగా, బహవల్పూర్ జైషే కార్యాలయంపై దాడిలో, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ఫ్యామిలీ హతమైంది. ఈ విషయాన్ని తాజాగా, జైషే టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఒక కార్యక్రమంలో ఒప్పుకున్నారు.
Read Also: Manchu Manoj : ఫ్యాన్ కాళ్ళు పట్టుకున్న మంచు మనోజ్
ఇదే కాకుండా, ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌తో ఎలా ముడిపడి ఉందనే విషయాలు కాశ్మీరీ వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ జనరల్స్, ఇతర అధికారులు పాల్గొన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాలతో పాక్ ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారని కాశ్మీరీ వెల్లడించాడు.
పాకిస్తాన్ సైన్యానికి చెందిన మీడియా, దాని ప్రజా సంబంధాల విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్, జైషే మహ్మద్, బహవల్‌పూర్‌లోని శిబిరాల మధ్య సంబంధాలను దాచడానికి ప్రయత్నించారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ శిబిరాల ఉనికిని ఖండించాయి. కాశ్మీరీ వ్యాఖ్యలతో పాకిస్తాన్, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి స్పష్టమయ్యాయి.
