Site icon NTV Telugu

Abir Gulaal: పాక్ యాక్టర్ ఫవాద్ ఖాన్ ‘‘బాలీవుడ్’’ సినిమాపై నిషేధం.!

Abir Gulaal

Abir Gulaal

Abir Gulaal: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ అయిన లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మంగళవారం, పహల్గామ్‌లోని బైసరీన్ పచ్చిన మైదానాలు చూస్తున్న టూరిస్టులపై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని శోకంలో ముంచింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌పై తీవ్ర చర్యలు ఉండాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే, భారత్ పాక్‌తో దౌత్య సంంధాలను తెగదెంపులు చేసుకుంది. పాకిస్తాన్‌తో ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేసుకుంది. ఇకపై పాకిస్తాన్ జాతీయులకు వీసాలు ఇవ్వబోమని తెగేసి చెప్పింది.

Read Also: Hyderabad : రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్..

తాజాగా, మరో చర్యకు భారత్ సిద్ధమైంది. పాకిస్తానీ నటులపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది. ఈ మేరకు పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ కాన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘‘అబీర్ గులాల్’’ భారతదేశంలో విడుదల కావడం లేదని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. వాణి కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మే 9న థియేటర్లలోకి రానుంది. వివేక్ బి అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్తి ఎస్ బాగ్ది డైరెక్షన్ చేశారు. ‘అబీర్ గులాల్’ ఈ నెల ప్రారంభంలో రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన భారతదేశంలో విడుదలను వ్యతిరేకించింది. తాజాగా, పహల్గామ్ ఘటన తర్వాత ఈ సినిమాపై మరింత వ్యతిరేకత పెరిగింది.

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, సినిమా థియేటర్లు ఈ సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధంగా లేవని, అనేక వినోద సంస్థలు దీనిని బహిష్కరించాలని డిమాండ్ చేశాయని, ఇప్పుడు మంత్రిత్వ శాఖ కూడా దాని విడుదలకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఫవాద్ ఖాన్ పహల్గామ్ మృతులకు తన సంతాపాన్ని తెలియజేశారు. “పహల్గామ్‌లో జరిగిన దారుణమైన దాడి వార్త విని చాలా బాధపడ్డాను. ఈ భయంకరమైన సంఘటన బాధితులతో మా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి . ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు బలం, స్వస్థత కోసం మేము ప్రార్థిస్తున్నాము” అని నటుడు ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version