Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి బాధితుల్ని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. అప్పటి వరకు ప్రకృతిని, కాశ్మీర్ అందాలను చూస్తూ సంతోషంగా ఉన్న వారిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. క్షణాల్లో వారి ఆనందాన్ని విషాదంగా మార్చారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడికి తెగబడ్డారు. లష్కరే తోయిబా అనుబంధ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఉగ్రసంస్థ జరిపిన దాడిలో 26 మంది మరణించారు.
పహల్గామ్ దాడి బాధితుడు శుభం ద్వివేది భార్య అశాన్య ద్వివేది తన భర్తకు ‘‘అమరవీరుడి’’ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ద్వివేది తనను తానున హిందువుగా గర్వంగా ప్రాణ త్యాగం చేసి ఇతరుల్ని రక్షించారని ఆమె అన్నారు. మొదటి బుల్లెట్ తన భర్తకు తగిలిందని, ఉగ్రవాదులు హిందువులు, ముస్లింలా అని అడగటానికి సమయం తీసుకున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పరిగెత్తి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సమయం ఉందని అని అశాన్య శనివారం తెలిపారు.
Read Also: Terror attack: కెనడాలో జనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఉగ్రదాడిగా అనుమానం..
పహల్గామ్ పచ్చిక మైదానాలను చూస్తున్న సమయంలో ఉగ్రవాదులు అమాయకపు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. వీరిలో శుభం ద్వివేది కూడా ఉన్నారు. శుభం, అశాన్యకు ఫిబ్రవరి 12న వివాహం జరిగింది. ఇంతలోనే ఉగ్రదాడిలో శుభం మరణించారు. ఆయన అంత్యక్రియాలు స్వగ్రామంలో గురువారం జరిగాయి. ప్రభుత్వం తన డిమాండ్‌ని అంగీకరిస్తే తాను జీవించడానికి ఒక కారణం ఉంటుందని అశాన్య చెప్పింది.
ఉగ్రవాదులు శుభంని హిందువా..? ముస్లిమా..? అని అడిగిన సమయంలో ఫ్రాంక్ చేస్తున్నారని తాను భావించినట్లు అశాన్య చెప్పింది. “వారు వచ్చిన వెంటనే, వారిలో ఒకరు మేము హిందువులమా లేక ముస్లింలమా అని అడిగారు? ఆ వ్యక్తులు (ఉగ్రవాదులు) ఫ్రాంక్ చేస్తున్నారని నేను అనుకున్నాను. నేను వెనక్కి తిరిగి, నవ్వి, ఏమి జరుగుతుందో అడిగాను. అప్పుడు వారు తమ ప్రశ్నను మళ్లీ అడిగారు. మేము హిందువులమని నేను సమాధానం ఇచ్చిన వెంటనే, కాల్పులు జరిగాయి . శుభమ్ ముఖం రక్తంతో కప్పబడి ఉంది. ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు” అని ఆమె చెప్పింది. తనను కాల్చి చంపాలని ఉగ్రవాదుల్ని వేడుకున్నానని, కానీ అందుకు వారు నిరాకరించి, మీ ప్రభుత్వానికి తాము ఏం చేశామో చెప్పేందుకు బతికే ఉండాలని చెప్పారని అశాన్య చెప్పింది.
