Asaduddin Owaisi: గత నెలలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లోని షాహీ జామా మసీదు వివాదంపై హింస చెలరేగింది. కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన అధికారుల బృందంపై ఓ వర్గం రాళ్లుతో దాడి చేసింది. స్థానికంగా ఉన్న ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. రాళ్ల దాడిలో 20కి మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మసీదుకు ఎదురుగా పోలీస్ అవుట్ పోస్ట్‌ని నిర్మిస్తోంది యోగి ఆదిత్యనాథ్ సర్కార్.
మసీదుకు ఎదురుగా కొత్త పోలీస్ అవుట్ పోస్టు నిర్మించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శనివారం విమర్శించారు. పాఠశాలలు, ఆస్పత్రులకు బదులుగా పోలీస్ పోస్టుటు, మద్యం బార్‌లను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయని ఓవైసీ విమర్శించారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో అతి తక్కువ సంఖ్యలో ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు డేటా సూచిస్తోందని ఓవైసీ ఎక్స్ వేదికగా చెప్పారు.
Read Also: AAP Vs LG: ఆప్ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశం
‘‘సంభాల్‌లోని జామా మసీదు ముందు పోలీసు పోస్ట్‌ను నిర్మిస్తున్నారు. దేశంలోని ఏ మూలకు వెళ్లినా.. అక్కడి ప్రభుత్వం పాఠశాలలు లేదా ఆసుపత్రులను తెరవడం లేదు. ఏదైనా నిర్మిస్తున్నారంటే అవి పోలీసు పోస్టులు, మద్యం బార్‌లు. వీటిని ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం వద్ద డబ్బు ఉంది. ముస్లిం ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో ప్రభుత్వ సౌకర్యాలు ఉన్నాయి’’ అని ఆయన పోస్ట్ చేశారు. ‘‘సత్యవ్రత్’’పేరుతో పోలీస్ అవుట్‌పోస్ట్‌కి డిసెంబర్ 28 శనివరం భూమి పూజ నిర్వహించారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కానుంది.
సంభాల్‌లోని జామా మసీదుని ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చి కట్టారని హిందూ పక్షం కోర్టుని ఆశ్రయించింది. దీంతో నవంబర్ 24న సర్వేకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అధికారులు సర్వేకి వెళ్లిన సమయంలో వేలాదిగా గుంపు అధికారులపై దాడులు చేశారు. ఈ కేసులో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన స్థానిక ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్‌తో పాటు, ఎమ్మెల్యే కుమారుడిపై అభియోగాలు నమోదయ్యాయి. భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత సెక్షన్ల కింద సంభాల్ హింసాకాండలో ఇప్పటివరకు 50 మందిని అరెస్టు చేశారు.