తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. పది గంటల కల్లా మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. తెలంగాణలో ఒక్కరోజు వ్యవధిలోనే వడదెబ్బకు గురై నలుగురు మృతిచెందారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని హెచ్చరించింది.
Read Also: PM Modi in Denmark: డెన్మార్క్‌లో ప్రధాని మోడీ ఫస్ట్ టూర్.. కీలక చర్చలు
ఇక, ఏపీ, తెలంగాణలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. మార్చి, ఏప్రిల్ నెలల్లో మాదిరిగానే మే మాసంలోనూ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని వాతావరణశాఖ చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండనుందని వెల్లడించింది. రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మరికొద్ది వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలావుండగా, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలుల్లో అస్థిరత కొనసాగుతోంది. 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. ఆ సమయంలో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.