Balochistan: భారతదేశానికి పాకిస్తాన్ గడ్డ నుంచి తిరుగులేని మద్దతు వచ్చింది. ప్రముఖ బలూచ్ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాక్-చైనా సంబంధాలు తీవ్రం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో చైనా తన సైన్యాన్ని బెలూచిస్తాన్‌లో మోహరించవచ్చని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు రాసిన బహిరంగ లేఖలో, బెలూచిస్తాన్ దశాబ్దాలుగా పాకిస్తాన్ నియంత్రణలో అణచివేతను ఎదుర్కొంటోందని, అందులో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Read Also: AP Deputy CM Pawan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. 96 గదుల నిర్మాణానికి శంకుస్థాపన
బలూచ్ జాతీయవాద నాయకులు మే 2025లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించారు. 2026 మొదటి వారంలో రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ “2026 బెలూచిస్తాన్ గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్”ను జరుపుకుంటుందని మీర్ బలూచ్ తాజాగా ప్రకటించారు. దీని వలన బెలూచిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. లేఖలో ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్యల్ని ప్రశంసించారు. పాక్‌పై భారత్ దాడి ఆదర్శప్రాయమైన ధైర్యం, ప్రాంతీయ భద్రత, న్యాయం పట్ల దృఢమైన నిబద్ధతకు నిదర్శనమని మీర్ బలూచ్ అన్నారు.
లేఖలో ఆయన 140 కోట్ల భారత ప్రజలకు ఆరు కోట్ల బెలూచిస్తాన్ ప్రజల తరుపున న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. లేఖలో బలూచిస్తాన్ ఇండియా మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను హైలెట్ చేశారు. హింగ్లాజ్ మాత మందిరం రెండు దేశాల మధ్య శాశ్వత సంబంధాలకు నిదర్శనమని అన్నారు. పాక్, చైనా వ్యూహాత్మక కూటమి గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC)ను దాని చివరి దశలకు చేర్చిందని ఆయన హెచ్చరించారు. బలూచిస్తాన్ రక్షణ, తమ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేయకపోతే దీర్ఘకాలంలో చైనా దళాలు బలూచిస్తాన్‌లో మోహరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే జరిగితే భారత్, బలూచిస్తాన్లకు ముప్పు కలుగుతుందని అన్నారు.