West Bengal: దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలపైనే చర్చ నడుస్తోంది. శనివారం మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో స్థానికులు దాడికి దిగారు. ఈ దాడి వెనక బీజేపీ ఉందని టీఎంసీ ఆరోపిస్తుంటే, టీఎంసీ అంతర్గత సంక్షోభాలే దాడికి కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇదిలా ఉంటే, మేనల్లుడు అభిషేక్‌పై దాడి కన్నా మమతా బెనర్జీకి అతిపెద్ద షాక్‌లు తగులుతున్నాయి. ఆదివారం నిర్వహించిన సమావేశానికి టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 20 మంది మాత్రమే హాజరయ్యారు. కీలక సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలు చూస్తే టీఎంసీలో సంక్షోభం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఏకంగా 60 మంది రాకపోవడంతో మమతా బెనర్జీ సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం తన నివాసంలో మమత ఈ భేటీని ఏర్పాటు చేసింది. శాసనసభాపక్ష నాయకుడు శోవన్దేబ్ చటోపాధ్యాయ్ ఈ భేటీకి పిలుపునిచ్చారని తెలుస్తోంది.
ఇప్పటికే, టీఎంసీ నేతలు, కార్యకర్తలపై బెంగాల్ వ్యాప్తంగా తిరుగుబాటు మొదలైంది. గత 15 ఏళ్లలో తృణమూల్ గుండాలు ప్రజల్ని పీడించారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడంతో వారి చొక్కాలు విప్పి మరీ ప్రజలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీలపై జరిగిన దాడులపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో కీలకమైన ఇద్దరు నాయకులపై దాడి జరిగితే ఎమ్మెల్యేలు హాజరయ్యే తీరిక లేకుండా ఉన్నారని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ఘోష్ అన్నారు.
మరోవైపు, వరసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో జూన్ 2 మమతా బెనర్జీ నిరసన కార్యక్రమానికి దిగుతున్నట్లు ప్రకటించారు. దీనిపై కార్యచరణ సిద్ధం చేయడానికి ఎమ్మెల్యేలను పిలిచినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం, సీఎం సువేందు అధికారి దూకుడు ముందు టీఎంసీ కుదేలవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లోని ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నారు. ఇక కీలక నేతలు కూడా దీదీపై తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు.
