Jamili Elections: భారతదేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో ఈనెల 16వ తేదీన లోక్‌సభ ముందుకు వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు వెళ్లబోతుందని అధికారిక వర్గాలు చెప్పుకొచ్చాయి. లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది. అలాగే, లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, అధికార బీజేపీ ఒకే దేశం.. ఒకే ఎన్నిక ప్రణాళిక అమలు దిశగా అడుగులు వేస్తుంది.
Read Also: Delhi March: నేటి మధ్యాహ్నం చలో ఢిల్లీకి రైతుల సంఘాల పిలుపు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత
అలాగే, మూడు కేంద్రపాలిత (పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూకశ్మీర్) ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుసంధానం చేసేలా.. చట్టాలను సవరించడానికి ఒక సాధారణ బిల్లుతో పాటు మరో రెండు ముసాయిదా చట్టాలకు మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఎజెండాలో ఈ బిల్లులు లేకపోయినా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాల సూచనల మేరకు ఇవి ఆమోదం పొందాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలనూ కూడా నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ వెల్లడించింది. ఇందు కోసం రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశ పెట్టాలని సూచించింది. అయితే, స్థానిక ఎన్నికలనూ పక్కన బెట్టిన కేంద్రం.. కేవలం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది.
Read Also: CM Chandrababu: జమిలీపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలు మాత్రం అప్పుడే..!
అయితే, దీనికి 50శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు. స్థానిక ఎన్నికలనూ వాటితో కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతో పాటు 50శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ, రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండొంతుల సపోర్టు కావాలి.. ఎన్డీయేకు అంత సంఖ్యా బలం లేదు. దీంతో ఇండియా బ్లాక్ లోని కొన్ని పార్టీల మద్దతు కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత తెలుస్తుంది.. ఎలా సాధ్యమవుతుందనేది. లోక్‌సభలో 542 మంది సభ్యులు ఉన్నారు.. అందులో ఎన్డీయేకు 293 మంది ఉండగా.. ఇండియా కూటమికి 235 మంది సంఖ్యా బలం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే.. 361 మంది సభ్యుల మద్దతు కావాలి.. బిల్లులపై సమగ్ర చర్చ జరగాలని మోడీ సర్కార్ చూస్తోంది. వాటిని పార్లమెంటులో ప్రవేశ పెట్టిన తర్వాత పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపే ఛాన్స్ ఉంది. ఈ కమిటీ ద్వారానే రాష్ట్రాల స్పీకర్లతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని సమాచారం.