జమిలి.. ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న పేరు. ఏ నాయకుడి నోట విన్నా.. ఏ రచ్చ బండ దగ్గర కూర్చున్నా.. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇంతగా జమిలి పేరు మార్మోగడానికి కారణం. మోడీ ప్రభుత్వం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సరికొత్త రాజకీయ ఆలోచనే కారణం. ఒకే దేశం-ఒకే ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్డీఏ-2 ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆలోచన చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో సాధ్యం కాలేకపోయింది. ఈసారైనా జమిలి ఎన్నికలు జరిపించి తీరాలని మోడీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందుకోసం తీవ్ర కసరత్తు చేసింది. అయితే జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే.. రాజ్యాంగంలో సవరణ చేయాల్సింది. ఈ విషయంలో గట్టెక్కితే.. జమిలికి దారులు తెరుచుకున్నట్టే. ఇందుకోసమే మంగళవారం లోక్‌సభలో జమిలి బిల్లును ప్రవేశపెట్టబోతుంది.
దేశంలో ఆయా సమయాల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించడం వల్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకప్పటికీ.. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అన్ని ధరలు రెట్టింపు అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం పెరగకుండా ఒకే దేశం-ఒకే ఎన్నికలతో కట్టడి చేయొచ్చని ఆలోచన చేస్తుంది. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల అభిప్రాయాలను సేకరించి.. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇటీవల ఈ నివేదికకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా.. ఆమెకు కూడా ఆమోదముద్ర వేశారు. ఇక చట్టసభల నిర్ణయమే మిగిలి ఉంది. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా బిల్లు ఆమోదం పొందితే మార్గం సుగమం అయినట్లే. మంగళవారమే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతోంది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందాలంటే.. అధికార పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. ఇప్పుడే దీనిపైనే సస్పెన్స్ కొనసాగుతోంది.
ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లు ఆమోదం పొందాలంటే “129వ రాజ్యాంగ సవరణ బిల్లు” జరగాలి. “1963లో చేసిన “కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు” సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బిల్లులను మొత్తం 32 పార్టీలు సమర్థిస్తుంటే.. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
లోక్‌సభలో బలాబలాలు
ఎన్డీఏ కూటమికి (బీజేపీ 240+మిత్రపక్షాలు 53) మొత్తం 293 స్థానాలు ఉన్నాయి.
బిల్లు ఆమోదం పొందాలంటే 364 సభ్యుల మద్దతు ఉండాలి
అంటే బిల్లుల ఆమోదానికి ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలి
కానీ ప్రస్తుతం అధికార పార్టీకి సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది
ఇక రాజ్యసభలో బలాబలాలు
రాజ్యసభలో మొత్తం 245 సభ్యులున్నారు
ఎన్డీఏ కూటమికి 112 మంది సభ్యులు ఉన్నారు.
ప్రతిపక్ష (ఇండియా) కూటమికి 85 సభ్యులు ఉన్నారు
ఇక్కడ బిల్లు ఆమోదం పొందాలంటే అధికార పార్టీకి 164 మంది సభ్యులు ఉండాలి
అంటే మూడింట రెండొంతుల బలం కావాలి
ఉభయ సభల్లోనూ అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదు. కేవలం సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది.
ఇక జమిలి బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టగానే “సంయుక్త పార్లమెంటరీ కమిటీ” ( జేపీసీ) పరిశీలనకు వెళ్తాయి. అలాగే 23 వ “లా కమిషన్” అభిప్రాయాలను, సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా పొందాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని అంశాలను పరిశీలించి, అన్ని పార్టీల మద్దతుతో బిల్లులకు చట్ట రూపం ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఒకవేళ రెండు బిల్లులు ఆమోదం పొందితే 2029లో దేశంలోని అన్ని చట్ట సభలకు (లోకసభ, అసెంబ్లీ) ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఇదే జరిగితే దేశ రాజకీయ వ్యవస్థకు, రాజకీయాలకు జమిలి ఎన్నికలు సరికొత్త రూపునివ్వనున్నాయి.