Har Ghar Tiranga: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. భారతీయ పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా జెండాలను విక్రయిస్తున్నారు. అతి తక్కువ ధరలో రూ. 25కి ఒక్కో జెండాను అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో గత 10 రోజుల్లో ఏకంగా కోటి జెండాలకు పైగా అమ్ముడుపోయాయని కేంద్ర ప్రసారశాఖ వెల్లడించింది. దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి గడపకు చేరిందని తెలిపింది. పోస్టాఫీసుల్లో, ఆన్ లైన్ ద్వారా జెండాల అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పింది.
Read Also: Fact Check: ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలా? ఇది నిజమేనా?
కాగా దేశంలోని ఏ అడ్రస్ కైనా పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉచితంగానే జెండాలను డోర్ డెలివరీ చేస్తోందని కేంద్ర ప్రసార శాఖ వివరించింది. ఈ పోస్టాఫీస్ పోర్టల్ ద్వారా 1.75 లక్షల జెండాలు ఆన్ లైన్ లో అమ్ముడుపోయాయని చెప్పింది .దేశవ్యాప్తంగా 4.2 లక్షల మంది తపాలా ఉద్యోగులు నగరాలు, పట్టణాలు, గ్రామాలతోపాటు, సరిహద్దు ప్రాంతాలలో, తీవ్రవాదుల ప్రభావిత జిల్లాల్లో పర్వత, గిరిజన ప్రాంతాల్లో సైతం హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపింది. అటు హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా రానున్న రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా మరింత పెద్ద సంఖ్యలో జెండాలు అమ్ముడుపోయే అవకాశం కనిపిస్తోంది.
భారత స్వాతంత్ర్య దినోత్సవం దగ్గర పడుతున్న వేళ కులమతాలకు అతీతంగా దేశ పౌరులు ఏకం అవుతున్నారు. తాజాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వారసత్వపు కట్టడాలు, చారిత్రక మసీదుల వద్ద ముస్లింలు జెండాలు పట్టి ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం, ఏలూరు, గుంటూరులో మసీదులు, మదర్సాల నుంచి బయటకు వచ్చి జెండాలతో ప్రదర్శనలు చేశారు. నినాదాలు చేస్తూ దేశభక్తి చాటుకున్నారు.