NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుంది.. వక్ఫ్ బోర్డుకు ఆస్తుల అప్పగింతపై ప్రధాని ఫైర్..

Modi

Modi

PM Modi: 2014 ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్‌బోర్డుకు ఢిల్లీలోని ప్రధాన భాగాల్లో ఉన్న 123 ఆస్తులను అప్పగించడాన్ని ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రస్తావించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తుందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ ఓట్ల కోసం ఆస్తులను వక్ఫ్ బోర్డుకు అప్పగించిందని ఆరోపించారు. 2024 ఎన్నికల సందర్భంగా తొలిసారిగా ఢిల్లీలోని ఎంపీ స్థానాల్లో ప్రధాని ప్రచారం ప్రారంభించారు. ఢిల్లీలో కాంగ్రెస్-ఆప్ కూటమి అవకాశవాదానికి పాల్పడుతున్నాయని, ఒక అవినీతి పార్టీ మరొ అవినీతి పార్టీని కవర్ చేస్తుందని ఈరెండు పార్టీలను ఉద్దేశించి ప్రధాని విమర్శించారు.

ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తర్వాత ఆయన వారసులు ఎవరు..? అని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ, తనకు వారసుడు ఉన్నట్లైతే 140 కోట్ల మంది భారతీయుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితం చేస్తానని ప్రధాని చెప్పారు. దేశ ప్రజల కోసం, పౌరుల కలలను సాకారం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశానని ప్రధాని ఈశాన్య ఢిల్లీలో జరిగిన ర్యాలీలో అన్నారు.

Read Also: Himanta Biswa Sarma: ముస్లిం రిజర్వేషన్లు కావాలంటే పాకిస్తాన్ వెళ్లి ఇవ్వండి..

కాంగ్రెస్-ఆప్ కూటమి ఢిల్లీని నాశనం చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని, ప్రజల విశ్వాసాన్ని ఈ రెండు పార్టీల నాయకులు విచ్చిన్నం చేస్తున్నారని ప్రధాని దుయ్యబట్టారు. అవినీతిని రూపుమాపేందుకు రాజకీయాలకు వచ్చామని చెప్పిన వారే వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి జైళ్ల వెంటి తిరుగుతున్నారని సీఎం కేజ్రీవాల్‌ని ఉద్దేశించి ప్రధాని మండిపడ్డారు.

ఆప్ కుంభకోణాలను బయటపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ క్రెడిట్ తీసుకోకుండా, తమ నాయకులను ఆప్‌తో బలవంతంగా కలిసి పనిచేయాలని ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు కోసం “ఓటు జిహాద్” కోసం వాదించే వారితో చేతులు కలిపిందని ప్రధాని మోడీ అన్నారు. ఓటు వేస్తామనే హామీతో దేశ ప్రజల ఆస్తుల్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించిందని కాంగ్రెస్‌పై ఆరోపించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 పునరుద్ధరణ మరియు భారతదేశం యొక్క అణు బాంబుల రద్దుకు ప్రతిపక్ష కూటమి మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.