ప్రముఖ ఒడిస్సీ కళాకారిణి మధుమిత రౌత్ (59) కన్నుమూశారు. శనివారం ఉదయం ఆమె గుండెపోటుతో మరణించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1950వ దశకంలో శాస్త్రీయ పరిజ్ఞానంతో ఒడిస్సీ నృత్య పునరుద్ధరణకు దోహదపడిన మాయాధర్ రౌత్ కుమార్తెనే మధుమిత రౌత్.
ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని సోదరుడు మనోజ్ రౌత్ తెలిపారు. మధుమిత చిన్న వయస్సులోనే నృత్యం నేర్చుకోవడం ప్రారంభించి.. ఢిల్లీకి చెందిన జయంతిక-మాయాధర్ రౌత్ స్కూల్ ఆఫ్ ఒడిస్సీ డాన్స్ డైరెక్టర్‌గా కొత్త తరం నృత్యకారులకు శిక్షణ ఇచ్చారు. మధుమిత రౌత్ నెదర్లాండ్స్‌లోని ఒక దేవాలయంలో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి ఒడిస్సీ కళాకారిణిగా రికార్డు సృష్టించారు. శాస్త్రీయ నృత్యాన్ని సజీవంగా ఉంచాలనే అంకితభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నృత్యకారులకు స్ఫూర్తినిచ్చారు.
ఒడిస్సీని ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి గాను మధుమిత అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలను అందుకున్నారు. భారతదేశంలోని ప్రధాన నృత్యోత్సవాలతో పాటు ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం, హంగరీ, ఆస్ట్రియా, స్పెయిన్, మొరాకో, ఫ్రాన్స్, పోర్చుగల్, జపాన్, యునైటెడ్ స్టేట్స్‌లోనూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.