NTV Telugu Site icon

Sachin Pilot: సీఎం అశోక్ గెహ్లాట్ అధిష్టానం సోనియా గాంధీ కాదు వసుంధర రాజే..

Sachin Pilot

Sachin Pilot

Sachin Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిల్ పైలెట్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అవినీతి సమస్యలపై సచిన్ పైలట్ అజ్మీర్ నుంచి జైపూర్ వరకు మే 11న ‘జన్ సంఘర్ష్ యాత్ర’ చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం గెహ్లాట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ అధిష్టానం సోనియాగాంధీ కాదని, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అని అన్నారు.

Read Also: Aeolus: భూమిపై క్రాష్ కాబోతున్న1360 కిలోల శాటిలైట్..

ధనబలం ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు వసుంధర రాజే, కౌలాష్ మేఘ్వాల్ మద్దతు ఇవ్వడానికి నిరాకరించానని, 2020లో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నుంచి బయటపడినట్లు గెహ్లాట్ ప్రకటించిన ఒక రోజు తర్వాత సచిన్ పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గెహ్లాట్ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పందించారు. గెహ్లాట్ తన పార్టీలో తిరుగుబాట్ల కారణంగా అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను విమర్శించడం, బీజేపీ నేతలను పొగడడం, కాంగ్రెస్ నేతల్ని అప్రతిష్టపాలు చేయడం తప్పని గెహ్లాట్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ సచిన్ పైలట్ అన్నారు.

రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. అధిష్టానం ఎన్నిసార్లు ఈ గొడవల్ని సరిచేద్ధాం అనుకున్నా.. మళ్లీ మొదటికే వస్తున్నాయి. 2020లో సచిన్ పైలట్, 18 మంది ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో సచిన్ పైలట్ బీజేపీ మద్దతు ఇస్తారని అనుకున్నప్పటికీ.. అధిష్టానం కలుగజేసుకోవడంతో నెల రోజుల్లో సంక్షోభం చక్కబడింది. అయితే పైలట్ తన ఉపముఖ్యమంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని కోల్పోవాల్సి వచ్చింది.