NTV Telugu Site icon

Devendra Fadnavis: ఛత్రపతి మాకు స్పూర్తి, పారిపోయే ప్రసక్తే లేదు.. రాజీనామాపై వెనక్కి తగ్గిన ఫడ్నవీస్..

Fadnavis

Fadnavis

Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ దారుణ ప్రదర్శనకు తాను బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల చెప్పారు. అయితే, అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ అగ్రనాయకత్వం వారించడంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు. తాను పారిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయాలని అమిత్ షా కోరిన ఒక రోజు తర్వాత ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో బీజేపీ 23 గెలుచుకోగా, 2024 ఎన్నికల్లో కేవలం 09 సీట్లకు మాత్రమే పరిమితమైంది.

శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘నేను అందరి ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నాను, ప్రధానమంత్రి. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ పేరు మార్మోగుతోంది, నిన్న, NDA ప్రధానమంత్రిగా ఆయన పేరును అంగీకరించింది, ఈ సారి మహారాష్ట్రలో మేము కోరుకున్నన్ని సీట్లు పొందలేదు. భవిష్యత్ వ్యూహాలను రూపొందిస్తున్నాము’’ అని ఆయన అన్నారు.

Read Also: Canada: ఇందిరా గాంధీ హత్యపై పోస్టర్లు.. ఖలిస్తానీల దురాగతం..

రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి గత కారణాలను వివరిస్తూ ఫడ్నవీస్ ‘‘ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి నేను నాయకత్వం వహించాను, కాబట్టి ఈ ఓటమికి నేనే బాధ్యత వహించాను. నా పదవికి రాజీనామా చేయడానికి అనుమతించాలని కోరాను. దీని వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో అట్టడుగు స్థాయిలో పనిచేయవచ్చని అనుకున్నాను. అయితే అగ్రనాయకత్వం తనపై నమ్మకం ఉంచింది. నాకు ఓ వ్యూహం ఉంది. తాను పారిపోయే వాడిని కాదు. కొందరు తాను నిరాశ చెందానని అనుకున్నారు. మనకు ఛత్రపతి శివాజీ స్పూర్తి. నేను ఎలాంటి భావోద్వేగ నిర్ణయం తీసుకోను. నా మెదడులో ఓ వ్యూహం ఉంది’’ అని అన్నారు.

మహారాష్ట్ర లోక్‌సభ ఫలితాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సత్తా చాటింది. మొత్తం 48 స్థానాల్లో కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దశ్ శివసేన 30 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక బీజేపీ కూటమిలోని బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, షిండే శివసేన కలిసి 17 సీట్లను గెలుచుకున్నాయి. అయితే, ప్రతిపక్ష కూటమి తమ కన్నా 2 లక్షల ఓట్లు మాత్రమే అధికంగా పొందాయని, కానీ సీట్లు భారీగా కోల్పోయామని అన్నారు. దళితులు, గిరిజనులను మభ్యపెట్టేలా కాంగ్రెస్ కూటమి ఓ కథనాన్ని రూపొందించిందని, వచ్చే ఎన్నికల్లో అది నడవదని చెప్పారు.