Site icon NTV Telugu

Abhishek Banerjee: ‘‘ఇక సర్జికల్ స్టైక్స్ వద్దు, పీఓకేని కలిపేయండి’’.. తృణమూల్ నేత..

Abhishek Banerjee

Abhishek Banerjee

Abhishek Banerjee: పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్‌కి గుణపాఠం నేర్పించాల్సిన సమయం ఆసన్నమైందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆదివారం అన్నారు. పాకిస్తాన్ ఆక్రమించిన మన భూభాగాలను తిరిగి పొందాలని అన్నారు. ఇక సర్జికల్ స్ట్రైక్స్ వద్దని పీఓకేని స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి సూచించారు. “పాకిస్తాన్‌కి అర్థమయ్యే భాషలో వారికి పాఠం నేర్పాల్సిన సమయం ఇది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)ని తిరిగి పొందాల్సిన సమయం ఇది.” అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Read Also: GVMC New Mayor: గ్రేటర్‌ విశాఖ మేయర్‌ అభ్యర్థి ఖరారు… రేపే ఎన్నిక..

రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వానికి అండగా నిలిచే సమయం ఆసన్నమైందని చెప్పారు. గత కొన్ని రోజులుగా తాను ప్రధాన మీడియా, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారి ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్నానని, పహల్గామ్ దాడికి కారణమైన భద్రతా లోపాలను పరిశోధించే బదులుగా, వారి నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం కోరకు కథనాన్ని ముందుకు తీసుకురావడంపై ఎక్కువ దృష్టి సారించినట్లు కనిపిస్తుందని పరోక్షంగా బీజేపీ గురించి అన్నారు.

ఏప్రిల్ 22న కాశ్మీర్ పహల్గామ్ సమీపంలోని బైసరన్ ప్రాంతంలో టూరిస్టులపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో 26 మంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మరోవైపు, పాక్ ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండటంతో భారత్ దౌత్యపరంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాటు సరిహద్దుల్ని మూసేస్తోంది. పాక్ జాతీయులకు వీసాల రద్దుతో పాటు, వారిని వారి దేశానికి వెళ్లాలని ఆదేశించింది.

Exit mobile version