AIADMK: ఎంపీ ఎన్నికల్లో తమిళనాడు రూలింగ్ పార్టీ డీఎంకే మరోసారి క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయింది. అయితే, ఆ పార్టీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరిగింది. మరోవైపు ప్రతిపక్ష అన్నాడీఎంకే(ఏఐడీఎంకే) కూడా చతికిలపడింది. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకే పలు కారణాల వల్ల బటయకు వెళ్లింది. దీంతో బీజేపీ, ఏఐడీఎంకేలు విడివిడిగా పోటీ చేసి నష్టపోయాయన్న మాట వినిపిస్తోంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూర్ నుంచి ఓడిపోవడాన్ని బీజేపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి.
READ ALSO: Siva lingam: రోజుకు 3 రంగుల్లోకి మారుతున్న శివలింగం.. ఎక్కడంటే..
ఇదిలా ఉంటే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చిగురిస్తుందా..? అంటే లేదనే సమాధానమే వస్తోంది. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి శనివారం ప్రకటించారు. ఈమేరకు సేలంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2019తో పోలిస్తే ప్రస్తుతం తమ పార్టీకి 1 శాతం ఓట్లు పెరిగాయని అన్నారు. ‘‘తమిళనాడులో బీజేపీ పెరిగిందని పలువురు ప్రచారం చేస్తున్నారు. 2014లో ఎన్డీయే ఓట్ల శాతం 18.80 శాతం. 2024లో ఎన్డీయే ఓట్ల శాతం 18.28 శాతం. కాబట్టి బీజేపీ కూటమి వృద్ధి చెందిందని చెప్పడం తప్పు. బీజేపీ, డీఎంకేల ఓట్లు తగ్గాయి కానీ మా ఓట్లు ఎక్కడా పోలేదని’’ చెప్పారు.