NTV Telugu Site icon

Bihar Politics: బిహార్‌లో దోస్తీపై అవగాహనకు వచ్చిన జేడీయూ-ఆర్జేడీ.. డిప్యూటీ సీఎంగా తేజస్వి!

Nitish Kumar

Nitish Kumar

Bihar Politics: బిహార్​లో జేడీయూ-ఆర్​జేడీ-కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా చకచకా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్.. సాయంత్రం 4 గంటలకు గవర్నర్​ను కలిసి, రాజీనామా లేఖ అందిస్తారని తెలిసింది. మరోవైపు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జేడీయూ అధిష్ఠానం పాట్నాలో నిర్వహించిన సమావేశం కీలక చర్చలకు వేదికైనట్లు తెలిసింది. “పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నితీశ్ కుమార్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని స్పష్టం చేశారు.” అని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. సరికొత్త కూటమికి నేతృత్వం వహించేందుకు సిద్ధమైన నితీశ్‌​కు శుభాకాంక్షలు అంటూ జేడీయూ జాతీయ పార్లమెంటరీ బోర్డ్ అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా ట్వీట్ చేశారు . అదే సమయంలో.. ఆర్​జేడీ నేతలు సైతం ఇలాంటి తీర్మానమే చేశారు. పాట్నాలో సమావేశమైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తాజా రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. నిర్ణయం తీసుకునే అధికారాన్ని తేజస్వీ యాదవ్‌కు అప్పగించారు. కాంగ్రెస్, వామపక్షాల నేతలు సైతం.. తేజస్వీకి అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రం సహా సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని లాలూ నిశితంగా గమనిస్తున్నారని.. అయితే రాజకీయ నిర్ణయాలన్నీ పూర్తి స్థాయిలో తేజస్వీనే తీసుకుంటున్నారని ఆర్​జేడీ వర్గాలు తెలిపాయి.

Bihar Political Crisis: బీజేపీకి నితీష్ కుమార్ గుడ్ బై.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం

నితీష్ కుమార్‌కు మద్దతు ఇచ్చేందుకు తేజస్వి యాదవ్ అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ విడిపోయిన చోటే మహాగటబంధన్ 2.0 ప్రారంభమవుతుందని ఆర్జేడీ పార్టీ వర్గాలు సూచించాయి. తేజస్వి యాదవ్ నితీశ్ కుమార్ మంత్రివర్గం డిప్యూటీ సీఎంగా, అతని అన్నయ్య తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రివర్గంలో ఉంటారని రాజకీయ వర్గాలు తెలిపాయి. ఇవాళ మధ్యాహ్నం జరిగిన తన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో నితీశ్ కుమార్ బీజేపీతో విడిపోయినట్లు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం వరకు గవర్నర్‌ను కలవనున్నారు. ఈ సమావేశంలో తేజస్వి యాదవ్‌తో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న ఇతర నేతలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.