Nitish Kumar: జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరి నేతల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఇటీవల బిహార్‌లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీకి బిహార్ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. మొన్నటి వరకు బీజేపీతో కలిసి సర్కారును నడిపిన నితీష్.. ఇటీవల తెగదెంపులు చేసుకున్నారు. ఈ క్రమంలో రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో 2024 ఎన్నికల వ్యూహం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. భావసారూప్యత ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే అవకాశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ నెల 7 నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్రపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేసే మార్గాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.”ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఏకం చేయడమే నా ప్రయత్నం. నన్ను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలనే ఉద్దేశం నాకు లేదు” అని నితీష్ కుమార్ అన్నారు.
Delhi Lieutenant Governor: ఆప్ నేతలకు ఢిల్లీ ఎల్జీ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?
జేడీయూ అధినేత ఇవాళ తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకున్నారు. తన మూడు రోజుల పర్యటనలో పలువురు కీలక ప్రతిపక్ష నాయకులను కలుసుకునే అవకాశం ఉంది. ఇందులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ, కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు వామపక్షాల నేతలను కూడా ఆయన కలవనున్నారు. నితీష్ కుమార్‌తో పాటు జేడీయూ పార్టీ జాతీయ అధ్యక్షుడు లల్లన్ సింగ్, బీహార్ మంత్రులు సంజయ్ ఝా, అశోక్ చౌదరి ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య మెరుగైన సమన్వయాన్ని నిర్ధారించడానికి నితీష్ కుమార్ త్వరలో మహారాష్ట్ర, హర్యానా మరియు కర్ణాటకలలో కూడా పర్యటించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బీహార్ ముఖ్యమంత్రిని పాట్నాలో కలిశారు. 2024 సాధారణ ఎన్నికల కోసం “బీజేపీ ముక్త్ భారత్” అనే నినాదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తారు.