Site icon NTV Telugu

Mamata Benerjee: టార్గెట్‌ 2024.. విపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయి, కలిసి పోరాడుతాం..

Mamata Benerjee

Mamata Benerjee

Mamata Benerjee: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీని గద్దె దించుతాయని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్న జేడీయూ అధినేత, బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్‌కు మమతా బెనర్జీ తోడయ్యారు. విపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయని… అందరం కలిసే పోరాడుతామని ఆమె తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తదితరులతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. రాజకీయమంటేనే యుద్ధమని ఆమె అన్నారు. గత 34 ఏళ్లుగా తాము పోరాడుతూనే ఉన్నామని అన్నారు. కోల్‌కతాలో టీఎంసీ గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అహంకారం, ప్రజల ఆగ్రహం రెండూ బీజేపీని తుదముట్టిస్తాయని అన్నారు.

మీడియా కూడా అసత్య ప్రచారాలను చేస్తుండటం దురదృష్టకరమని మమత చెప్పారు. తనకు, అభిషేక్ బెనర్జీకి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేసిందని… ఇలాంటి అవాస్తవాలతో టీఆర్పీ పెరగదని అన్నారు. పశువుల స్మగ్లింగ్ కేసులో అనుబ్రత మోండల్ అరెస్ట్ పై మాట్లాడుతూ… ఆయన పోరాట యోధుడిగా జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. పెద్ద నేతలు అరెస్ట్ అయితే, కార్యకర్తలు భయపడతారని వారు భావిస్తున్నారని అన్నారు.

Leaders On Governor Tamilisai: టార్గెట్ గవర్నర్.. ఏకమైన అధికార, ప్రతిపక్షాలు

మరోవైపు బీజేపీని ఓడించాలన్న సంకల్పంతో.. కాంగ్రెస్​ భారత్​ జోడో యాత్రను బుధవారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్​ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టారు. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఐఎన్‌ఎల్‌డీ అధినేత ఓపీ చౌతాలా, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్‌ యాదవ్‌, ఆయన తనయుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులతో భేటీ అయ్యారు. తాజాగా ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్‌ను కూడా కలిశారు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తొలి ప్రాధాన్యమని.. 2024 ఎన్నికల్లో ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది తర్వాత అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version