భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికయ్యారు. జేపీ నడ్డా వారసుడిగా బీహార్ నేతకు అవకాశం దక్కింది. సోమవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కమల దళపతిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిన్న వయసులో అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఘనత ఆయనకే దక్కింది. ఈరోజు ఉదయం నితిన్ నబిన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంలో కమల దళపతిగా నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీల అధ్యక్షులు, రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, జాతీయ ఆఫీస్ బేరర్లు సహా ఇతర సీనియర్ నాయకులు హాజరవుతారు.
నితిన్ నబిన్..
నితిన్ నబిన్ 1980లో రాంచీలో జన్మించారు. తండ్రి కిశోర్ ప్రసాద్ సిన్హా మరణించాక 2006లో రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా బంకిపూర్ అసెంబ్లీ నుంచి 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. డిసెంబర్ 14న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. బీహార్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అనేక సవాళ్లు ఉన్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు నితిన్ నబిన్‌కు తొలి పరీక్ష కానుంది.
