దేశంలో ఎక్కడో చోట ప్రతీ రోజు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలన కలిగించింది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వాలు నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలను అమలులోకి తెచ్చినా కూడా కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. వావీ వరస, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు బరి తెగిస్తున్నారు.
ఢిల్లీలో నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచనలం కలిగించిందో అందరికి తెలుసు. సరిగ్గా అలాంటి ఘటనే బీహార్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో అత్యాచారానికి ఒడిగట్టారు నలుగురు దుర్మార్గులు. పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రంలో మంగళవారం తూర్పు చంపారన్ జిల్లా మోతీహరీ బస్ స్టాండ్ లో బస్ కోసం ఎదురుచూస్తున్న బాలికకు.. బస్సు బెట్టియాకు వెళ్తుందని నమ్మించి ఎక్కించుకున్నాడు డ్రైవర్, కండాక్టర్. బాలికకు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి స్పృహతప్పిన తరువాత నలుగురు నిందితులు కదులుతున్న బస్సులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలికకు స్పృహ వచ్చిన తర్వాత బస్సులో ఉన్నానని.. బస్సు డోర్లు లాక్ చేసి ఉన్నాయని..నలుగురు నిందితులు బాధిత బాలికను బస్సులోనే ఉంచి పారిపోయారని.. అటుగా వచ్చిన వ్యక్తుల సహయంతో బయటపడినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్, హెల్పర్ తో సహా నలుగురు నిందితులనున అరెస్ట్ చేసినట్లు బెట్టియా పోలీసులు వెల్లడిచారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్త బెట్టియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు పోలీసులు.