Nipah Virus: కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఆరుగురికి వైరస్ సోకగా.. ఇద్దరు మరణించారు. ముఖ్యంగా కోజికోడ్ జిల్లాలో హైఅలర్ట్ కొనసాగుతోంది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసులు కూడా అటవీ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో విజృంభిస్తున్నా నిపా వైరస్ ‘బంగ్లాదేశ్ వేరియంట్’ అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చీఫ్ డాక్టర్ రాజీవ్ బాహల్ శుక్రవారం కీలక హెచ్చరిక చేశారు. కోవిడ్ సోకిన వారితో పోలిస్తే నిపా వైరరస్ సోకిన వారిలో మరణాలు రేటు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కోవిడ్ కన్నా నిపా ప్రమాదకరమన్నారు. కోవిడ్ సోకిన వారిలో మరణాల శాతం 2-3 శాతం ఉంటే, నిపా సోకిన వారిలో మరణాల రేటు 40-70 శాతం మధ్య ఉంటుందని అన్నారు.
Read Also: Sreeleela : పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న శ్రీలీలా.. ఆ చూపులకే కుర్ర కారు ఫిదా..
మరోవైపు నిపా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి 20 డోసుల మోనోక్లోనల్ యాంటీబాడీలను సరఫరా చేయాలని భారత్, ఆస్ట్రేలియాను కోరింది. ఈ వైరస్ ను అరికట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఐసీఎంఆర్ ఉంది. ప్రస్తుతం ఇండియా కోరుతున్న మోనోక్లోనల్ యాంటీబాడీల వల్ల వేరే దేశాల్లో నిపా బారిన పడిన 14 మంది చికిత్స తర్వాత కోలుకున్నారని బాహాల్ చెప్పారు.
కోజికోడ్ జిల్లాలో ప్రభావిత ప్రాంతాల్లోని పంచాయతీల్లో లాక్ డౌన్ విధించారు. ప్రజల కదలికను తగ్గించారు. మరోవైపు కోజికోడ్ జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు ప్రకటించింది. వారం రోజుల పాటు విద్యాసంస్థల్ని మూసేసింది. ఇప్పటి వరకు నిపా వైరస్ సోకిన వారి కాంటాక్ట్ లిస్టు 1080కి పెరిగిందని ఆరోగ్య మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే కాంటాక్ట్ లిస్టులో 327 మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరందరికి ఎలాంటి లక్షణాలు లేనట్లుగా తెలుస్తోంది.