PM Modi to Attend Oath Ceremonies of Nagaland, Meghalaya CMs: ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నేత కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. సంకీర్ణంలో బీజేపీ కూడా భాగస్వామ్యం కాబోతోంది. ఇక నాగాలాండ్ లో నేషనలిస్టు డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ( ఎన్డీపీపీ) నేత నెపియూ రియో నేతృత్వంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంగళవారం రెండు రాష్ట్రాల సీఎంలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Read Also: Eknath Shinde : ఆయనో రాష్ట్రానికి సీఎం.. అయితేనేం మనుమడు చెప్తే వినాల్సిందే
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే త్రిపురలో బీజేపీ గెలిచి మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేయబోతోంది. త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మాణిక్ సాహా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇటీవల ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో మూడు ఈశాన్య రాష్ట్రాల్లో సత్తా చాటింది. త్రిపురలో సొంతగా మరోసారి అధికారంలోకి రాగా.. మేఘాలయ, నాగాలాండ్ లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలకు గానూ ఎన్డీపీపీ+బీజేపీ 37 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మేఘాలయాలో 60 స్థానాల్లో కొన్రాడ్ సంగ్మా పార్టీ ఎన్పీపీ 27 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 2 చోట్ల గెలుపొందింది. మరికొంత మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇక త్రిపురలో 32 స్థానాల్లో బీజేపీ+ఐపీఎఫ్టీ కూటమి విజయం సాధించి రెండోసారి అధికారంలోకి రాబోతున్నాయి.