NTV Telugu Site icon

Bhagavad Gita: లక్ష మంది భగవద్గీత పఠనం.. బెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ

Bhagavad Gita

Bhagavad Gita

Bhagavad Gita: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్వహించిన ‘భగవద్గీత పఠనం’ బీజేపీ, టీఎంసీల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ హిందూ ఐక్యతను ప్రోత్సహిస్తోందని, హిందూ ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారంటూ త‌‌‌‌‌‌‌‌ృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కోల్‌కతాలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో భగద్గీత పఠనానికి లక్ష మంది ప్రజలు హాజరయ్యారు. భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ యూనిట్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపుగా 1,20,000 మంది ఈ కార్యక్రమం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కోల్‌కతాలో జరిగిన ‘లోఖే కొంతే గీతాపథం’ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Seema Haider: భారత్-పాకిస్తాన్ “సరిహద్దు”పై ప్రశ్న..స్టూడెంట్ ఏం రాశాడో తెలుసా..? చూస్తే నవ్వు ఆపుకోలేరు..

రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెబుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. భగవద్గీత ప్రపంచానికి అందించిన అతిపెద్ద కానుక అని, ఈ కార్యక్రమాన్ని హేళన చేసిన వారికి హిందూ ధర్మ, సంప్రదాయాల పట్ల గౌరవం లేదని, హిందువులను విభజించడంలో విఫలం అవుతున్నారంటూ.. పరోక్షంగా టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం రాష్ట్రంలో హిందువులను ఐక్యం చేస్తుందని, భగవద్గీత పఠించడమే కాకుండా, హిందువులను ఐక్యం చేయడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. గీతా పారాయణంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ బీజేపీ నేతలు మాత్రం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని, మతాన్ని రాజకీయం చేయడం బీజేపీకి అలవాటే అని దుయ్యబట్టారు. టీఎంసీ మంత్రి ఉదయన్ గుహా మాట్లాడుతూ.. గీతాపారయణ కార్యక్రమం బదులుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ని నిర్వహించొచ్చని, బెంగాల్ ప్రజలు ఇలాంటి వాటిని పట్టించుకోరని అన్నారు.