Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహాయుతి కూటమిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలు పొత్తులో ఉన్నాయి. అయితే, ఆదివారం అజిత్ పవార్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో తన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని చెప్పారు. “ఎన్సీపీ లోక్‌సభ ఎన్నికలలో మహాయుతి మిత్రపక్షాలతో కలిసి పోరాడింది. పార్టీ తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మిత్రపక్షాలతో కలిసి పోరాడుతుంది. అయితే, మేము పౌర మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తాము,” అని ఆయన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
Read Also: Reel Turns Tragic: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఉరి బిగుసుకుని 11 ఏళ్ల బాలుడి మృతి
ఇటీవల ఎన్సీపీకి పట్టున్న పింప్రి-చించ్వాడ్ లోని అజిత్ పవార్ వర్గం నుంచి పలువురు నేతలు శరద్ పవార్ వర్గంలోకి మారిన తర్వాత అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్సీపీ గెలుపు కోసం కేవలం అసెంబ్లీ ఎన్నికలకే కాకుండా స్థానిక, పౌర సంస్థల ఎన్నికలకు కూడా సన్నద్ధం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. జూలై 2023లో శరద్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ బయటకు వచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరి, ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది.
ఇదిలా ఉంటే శుక్రవారం రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే మాట్లాడుతూ..బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాబోయే స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఓటర్లకు మరింత చేరువ కావాలని పార్టీ కార్యకర్తల్ని కోరారు. మహారాష్ట్రలో 27 మున్సిపల్ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్‌లు, రెండు మున్సిపాలిటీలకు దాదాపు రెండేళ్లుగా ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి.