Home minister narottam mishra comments on Shabana Azmi, Naseeruddin Shah: మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, జావేద్ అక్తర్ లపై సంచలన విమర్శలు చేశారు. వీరంతా తుక్డే-తుక్డే గ్యాంగ్ ఏజెంట్లే అని శనివారం అభివర్ణించారు. వీరంతా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో నరోత్తమ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నటులు, గీత రచయితలు బీజేపీ రాష్ట్రాల్లోని సమస్యలపై మాత్రమే మాట్లాడుతున్నారని.. బీజేపీ పాలిత ప్రభుత్వాలను ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా,జావేద్ అక్తర్ వంటి వారు తుక్డేతుక్డే గ్యాంగ్ స్లీపర్ సెల్ ఏజెంట్లని విమర్శలు చేశారు. వీరికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే సంఘటనలే కనిపిస్తాయని..వారి వ్యాఖ్యలతో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని నరోత్తమ్ మిశ్రా అన్నారు. బిల్కిస్ బానో కేసులో నిందితులును 15 ఏళ్ల తరువాత గుజరాత్ ప్రభుత్వం విడుదల చేస్తే.. షబానా అజ్మీ ఇప్పుడు తన గొంతును వినిపిస్తున్నారని అన్నారు.
ఇటీవల ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షబానా అజ్మీ, బిల్కిస్ బానో కేసులో నిందితులను వదిలిపెట్టిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మాటలు రావడం లేదని.. నిందితుల విడుదలపై సిగ్గు పడుతున్నానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. ఇద్దరు నటులతో పాటు గేయ రచయిత జావేద్ అక్తర్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగే సంఘటనలపై వీరెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
రాజస్థాన్ రాష్ట్రంలో కన్హయ్యలాల్ ను దారుణంగా చంపితే..జార్ఖండ్ దుమ్కా కేసులో బాలికను సజీవ దహనం చేసిన సంఘటనలపై షబానా అజ్మీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తుక్డే తుక్డే గ్యాంగ్, అవార్డ్ వాపసీ గ్యాంగ్ వీటిని చూడవని.. ఇది వారి చెడు మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు.