Delhi: పేరు మార్పులపై దృష్టి పెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇపుడు రాజధాని న్యూఢిల్లీలో తీన్‌మూర్తి భవన్‌లో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్) పేరును మార్చారు. ఇకపై ఈ మ్యూజియం ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సోసైటీ(పీఎంఎంఎల్) పేరుతో కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం సోమవారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పేరు మార్పుపై ప్రతిపక్ష కాంగ్రెస్.. అధికార బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నెహ్రూ పేరుని చరిత్ర పుటల్లోంచి తొలగించడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడగా, ప్రధానమంత్రులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చామని బీజేపీ ఎదురుదాడికి దిగింది. అంతర్జాతీయంగా ఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్) పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడే వివాదం రేగింది. ‘‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇక నుంచి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీగా మారింది. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వైవిధ్యాన్ని చాటి చెప్పడానికే ఈ పేరు మార్పు జరిగింది. ఈ నెల 14 నుంచి ఉత్వర్వులు అమల్లోకి వచ్చాయని పీఎంఎంల్ వైస్ చైర్మన్ సూర్యప్రకాశ్ వెల్లడించారు. తీన్‌మూర్తి భవనంలో 16 ఏళ్లపాటు నెహ్రూ అధికారిక నివాసంగా ఉంది. ఆ తరువాత 1966, ఏప్రిల్1న అందులో నెహ్రూ మ్యూజియంను ఏర్పాటు చేశారు.
Read also: Dhana Lakshmi Stotram: మీ ఇంట ధాన్యసిరులు కురిపించే ధాన్యలక్ష్మీ “పసుపుకొమ్ముల అర్చన”
మాజీ ప్రధాని కాంగ్రెస్ అధినాయకుడు పండిట్ జవహార్ లాల్ నెహ్రూ వారసత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే ప్రధాని మోడీ ఎజెండా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘‘ప్రధాని మోడీ అభద్రతా భావం, భయాందోళనల మధ్య నెహ్రూ మ్యూజియం పేరు మార్చారు. నెహ్రూ వారసత్వాన్ని విధ్వంసం చేయాలని ఆయన భావిస్తున్నారు. మ్యూజియం పేరులో ఎన్ స్థానంలో పీ అని మార్చారు. అందులో ‘‘పీ’’ అంటే చిన్నతనం, ఇబ్బంది పెట్టడం’’ అని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. నెహ్రూ పేరు మార్చినంత మాత్రాన స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన పోషించిన పాత్రను, భారత్‌ను లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా ఆయన నడిపించిన విధానాన్ని చెరిపేయలేరని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ చేసిన ఆరోపణల్ని బీజేపీ కొట్టిపారేసింది. దేశాని ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరి ఘనతలు ప్రపంచానికి చాటి చెప్పడానికే మ్యూజియం పేరుని మార్చినట్టు స్పష్టం చేసింది. లాల్‌బహదూర్ శాస్త్రి, పీ.వీ.నరసింహారావు, హెచ్.డి.దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ఇలా ఎందరో భారత దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దారని, ఈ మ్యూజియం ఏ ఒక్కరికో, ఒక కుటుంబానికో చెందినది కాదని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పష్టం చేశారు. ప్రధాన మంత్రులకు గౌరవంగా ఉండటం కోసమే పేరు మార్చినట్టు తెలిపారు.