Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. శివసేన పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం విల్లు-బాణం గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందుతాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి, శివసేన మాజీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తాకినట్లు అయింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండేను ‘ మారలేని ద్రోహి’గా అభివర్ణించాడు. వారు శివసేన చిహ్నాన్ని దొంగలించారని.. మేము పోరాడుతూనే ఉంటామని.. ఆశల్ని కోల్పోమని.. ప్రస్తుతానికి దొంగతంపై షిండే సంతోషంగా ఉండనివ్వండి అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.
Read Also: Shiv Sena: శివసేన పేరు, పార్టీ గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానివే.. స్పష్టం చేసిన ఈసీ
ఎన్నికల సంఘం నిర్ణయం ‘ప్రజాస్వామ్య హత్య’గా అభివర్ణించారు ఠాక్రే. అసలు విల్లు బాణం గుర్తు తమ వద్ద ఉన్నాయని.. షిండే వర్గం కేవలం వాటిని కాగితాల్లో మాత్రమే కలిగి ఉన్నారంటూ ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని ఇప్పుడు ప్రధాని ఎర్రకోట నుండి ప్రకటించాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును కోరామని.. ఇంకా తీర్పు రాకముందే, ఎన్నికల సంఘం పార్టీ పేరు, గుర్తును షిండే వర్గానికి కేటాయిండచారని.. ఇది అన్యాయం అని అన్నారు. మహారాష్ట్రలో మోదీ పేరు పనిచేయదనే, అక్రమంగా బాలాసాహెబ్ ఠాక్రే పేరు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని.. వేచి ఉండాల్సిందిగా తాను ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించానని.. భవిష్యత్తులో ఎవరైనా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు కావచ్చు అంటూ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. తమను నిజమైన శివసేనగా గుర్తించి ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సత్యం, ప్రజల గెలుపుగా అభివర్ణించారు ముఖ్యమంతి ఏక్ నాథ్ షిండే. ప్రజాస్వామ్యంలో అంకెలు ముఖ్యమని అవి తమకు ఉన్నాయని.. ఇది బాలాసాహెబ్ ఠాక్రే ఆశ్వీర్వాదం అని అన్నారు. ఎన్నికల సంఘం, బీజేపీకి మద్దతుగా నిలుస్తోందని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు ఈసీ నిర్ణయం వెలువడగానే ట్విట్టర్ లో ఏక్ నాథ్ షిండే విల్లు-బాణం గుర్తును అప్డేట్ చేశారు.