Site icon NTV Telugu

Tahawwur Rana: ఢిల్లీ చేరుకున్న తహవూర్ రాణా.. భారీ బందోబస్తు ఏర్పాటు

Mumbaublast

Mumbaublast

26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవూర్ రాణా ఢిల్లీ చేరుకున్నాడు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రాణాను ఢిల్లీకి తీసుకొచ్చారు. రాణాను న్యాయస్థానం ఎదుట హాజరు పరచనున్నారు. పాటియాలా కోర్టు దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రయల్ కోర్టు రికార్డులను ఇప్పటికే పాటియాలా కోర్టుకు తరలించారు.

ఇక ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్‌ మాన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలానికి లేకపోతే ట్రయల్ పూర్తయ్యేవరకు ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అప్పిలేట్ కోర్టుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించనున్నారు. ఏది ముందుగా పూర్తయితే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.

తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. ఉగ్ర దాడుల్లో కీలక పాత్ర పోషించాడన్న ఆరోపణలపై 2009లో అరెస్టయ్యాడు. గత కొంత కాలంగా తహవూర్ రాణా అమెరికా జైల్లో మగ్గుతున్నాడు. అయితే ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించాలని ట్రంప్‌ను కోరారు. మొత్తానికి మోడీ చేసిన దౌత్యం ఫలించింది. అయితే తనను భారత్‌లో హింసిస్తారని.. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో నిందితుడు వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో రాణా భారత్‌‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయింది.

Exit mobile version