Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. న్యూయార్క్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. గతేడాది బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనను, షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడాన్ని భారత్ ఇష్టపడలేదని ఆయన అన్నారు. దీని వల్ల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సందర్భంగా న్యూయార్క్‌లో సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్)ను పునరుద్ధరించడం గురించి యూనస్ మాట్లాడారు.
Read Also: CM Chandrababu: “మీ కోరిక తీరింది.. నా కల నెరవేర్చండి”.. కొత్త టీచర్లకు సీఎం కీలక సూచన..
‘‘విద్యార్థులు చేసింది వారికి నచ్చకపోవచ్చు. ప్రస్తుతం, భారత్‌తో మాకు సమస్యలు ఉన్నాయి’’ అని అన్నారు. భారత మీడియా కొన్ని తప్పుడు నివేదికలు పరిస్థితిని మరింత దిగజార్చాయని ఆరోపించారు. భారతదేశం నుంచి చాలా నకిలీ వార్తలు వస్తున్నాయని, అది ఇస్లామిక్ ఉద్యమం అని ప్రచారం జరుగుతోందని అన్నారు. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా సార్వత్రిక ఎన్నికలు జరిగేలా తాత్కిలిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
భారతదేశం షేక్ హసీనాకు ఆశ్రయం ఇస్తోందని, ఇది బంగ్లాదేశ్-భారత్ మధ్య ఉద్రిక్తతల్ని సృష్టిస్తోందని ఆరోపించారు. సార్క్ పునరుద్ధరించడంలో యూనస్ భారత్‌ని లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ-మధ్య ఆసియా ప్రత్యేక యూఎస్ రాయబారి, భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్‌తో సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, గతేడాది బంగ్లాదేశ్ అల్లర్లలో హిందువులపై అత్యాచారాలు, హత్యలు, ఆస్తుల్ని తగలబెడుతున్నా యూనస్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ప్రభుత్వంలోని కొందరు భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని ప్రగల్భాలు పలికారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.