Site icon NTV Telugu

BJP: ప్రధాని నివాసంలో సీఎంల ఎంపికపై కీలక సమావేశం.. రాజీనామా చేసిన ఎంపీలు హాజరు..

Bjp

Bjp

BJP: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సూపర్ కిక్ ఇచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉండటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది. దీంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలన్నింటిలో బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.

ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాలకు సీఎంలను ఎన్నుకునే అంశంపై ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసంలో బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎంపీ పదవులకు రాజీనామా చేసిన 10 మంది ఎంపీలు కూడా హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికపై నిన్న కూడా సమావేశం జరిగింది.

Read Also: Amit Shah: పీఓకే కూడా మనదే, అక్కడ 24 సీట్లు రిజర్వ్.. జమ్మూకాశ్మీర్‌లో పెరిగిన సీట్లు..

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. ఇక మధ్యప్రదేశ్‌లో అధికారం నిలుపుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా సీఎం అభ్యర్థి ఎవరనేది చెప్పకుండానే బీజేపీ పోటీకి దిగి ఘన విజయం సాధించింది. అయితే ఈసారి కొత్త ముఖాలను సీఎం అభ్యర్థులుగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వసుంధర రాజే, రమణ్ సింగ్ సీఎంలుగా పనిచేశారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. మాజీ సీఎం వసుంధర రాజేతో పాటు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీపీ జోషి, సీనియర్ నేత కిరోరి లాల్ మీనా సీఎం రేసులో ఉన్నారు.

రాజీనామా చేసిన ఎంపీల్లో మధ్యప్రదేశ్‌కి చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్ నుండి, రాజీనామా సమర్పించిన ఎంపీలలో రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా మరియు దియా కుమారి ఉన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి ఉన్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బాబా బాలక్ నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామా చేయకపోవడం గమనార్హం.

Exit mobile version