Cremation dispute: అన్నదమ్ముల మధ్య తండ్రి అంత్యక్రియల వివాదం ఏకంగా, తండ్రి మృతదేహాన్ని సగం నాకు ఇవ్వాలని అనే దాకా వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టికామ్‌గఢ్ జిల్లాలో జరిగింది. తండ్రి అంత్యక్రియల్లో సోదరుల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో అంత్యక్రియల వివాదంలో పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
టికామ్‌గఢ్ జిల్లాల ప్రధాన కార్యాలయం నుంచి 45 కి.మీ దూరంలో ఉన్న లిధోరాతాల్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. చిన్న కుమారుడు దేశ్‌రాజ్ దగ్గర నివసించే ధ్యాని సింగ్ ఘోష్(84) ఆదివారం అనారోగ్యంతో మరణించాడు. గ్రామానికి దూరంగా నివసించే పెద్ద కుమారుడు తండ్రి మరణ వార్త తెలియగానే అక్కడికి చేరుకున్నాడు.
Read Also: Kejriwal: ఈవీఎంలతో జిమ్మిక్కులకు బీజేపీ కుట్ర.. అప్రమత్తంగా ఉండాలన్న కేజ్రీవాల్
తండ్రి అంత్యక్రియల విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తండ్రి అంత్యక్రియల్ని పెద్ద కుమారుడు చేస్తానని చెప్పగా, తానే అంత్యక్రియలు చేయాలనేది తండ్రి కోరిక అని చిన్న కుమారుడు వాగ్వాదానికి దిగారు. సంఘటన జరిగిన సమయంలో పెద్ద కొడుకు కిషన్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఒక వేళ అంత్యక్రియలకు తనను అనుమతించకుంటే తండ్రి మృతదేహాన్ని సగానికి కోసి ఇవ్వాలని పట్టుబట్టాడు. ఈ వివాదంపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చివరకు కిషన్‌ని ఒప్పించడంతో చిన్న కుమారుడు దహనసంస్కారాలు నిర్వహించాడు.