Vivek Bindra Controversy: ప్రముఖ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన వివేక్ బింద్రా తన భార్యపై గృహహింసకు పాల్పడ్డారు. పేరుకు మాత్రమే మోటివేషనల్ స్పీకర్ కానీ, పెళ్లైన కొన్ని గంటల్లోనే భార్యపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బింద్రా వివాదం చర్చనీయాంశంగా మారింది. బింద్రా భార్య యానికా సోదరుడు వైభవ్ క్వాత్రా నోయిడాలోని సెక్టార్ 126లో అతని బావపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నోయిడాలోని సెక్టార్ 94లోని సూపర్ నోవా వెస్ట్ రెసిడెన్సీలో బింద్రా, యానికా దంపతులు నివసిస్తున్నారు.
డిసెంబర్ 7 తెల్లవారుజామున బింద్రాకు, అతని తల్లి ప్రభకు మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య గొడవను సద్దుమణిగించేందుకు యానికా ప్రయత్నించడంతో గొడవ మలుపుతిరిగింది. అకారణంగా బింద్రా, యానికాపై చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో యానికా శరీరంపై గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: BJP: త్వరలో లాలూ, నితీష్ కుమార్ పార్టీలు విలీనం.. బాంబు పేల్చిన కేంద్రమంత్రి..
పోలీస్ ఎఫ్ఐఆర్ ప్రకారం.. డిసెంబర్ 6న బింద్రా, యానికా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని గంటల తర్వాత బింద్రా, యానికాను ఒక గదిలోకి తీసుకెళ్లి, ఆమెపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ.. జట్టు పట్టుకుని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫోన్‌ని పగలగొట్టాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆయనపై కేసు నమోదైంది.
హై ప్రొఫైల్ ఇండియన్ మోటివేషనల్ స్పీకర్, యూట్యూబర్ అయిన బింద్రా బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్(BBPL) అనే సంస్థకు సీఈఓగా ఉన్నాడు. ఇతనికి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే మరో మోటివేషనల్ స్పీకర్, యూట్యూబర్ సందీప్ మహేశ్వరి తన యూట్యూబ్ ఛానెల్‌లో ‘‘బిగ్ స్కామ్ ఎక్స్‌పోజ్’’ పేరుతో బింద్రా కంపెనీ చేతిలో మోసపోయామని పేర్కొన్న విద్యార్థుల కథనాన్ని ప్రసారం చేశాడు. అయితే ఈ ఆరోపణల్ని బింద్రా ఖండించారు.