Most of Bihar’s ministers Face Criminal Cases: బీహార్ లో ఎన్డీయేతో ఉన్న జేడీయూ పార్టీ ప్రస్తుతం ఆర్జేడీతో మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేసింది. దీంతో జేడీయూతో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంగా మారింది. నితీష్ కుమార్ రాజీనామా చేసి.. మళ్లీ ఆర్జేడీ మద్దతుతో ముఖ్యమంత్రిగా బీహార్ సీఎంగా బాధ్యతలు తీసుకోగా.. ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల 31 మంత్రులతో బీహార్ కేబినెట్ కొలువు తీరింది.
ఇదిలా ఉంటే బీహార్ కేబినెట్ లో 72 శాతం మంత్రులు నేర చరిత్ర కలిగిన వారే అని ఎన్నికల హక్కల సంఘం, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. స్వయంగా బీహార్ కేబినెట్ లోని న్యాయశాఖ మంత్రిపైనే క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ బీహార్ రాష్ట్రంలో గుండా రాజ్ ప్రారంభం అయిందని విమర్శిస్తోంది. ఆర్జేడీ నేత, న్యాయశాఖ మంత్రి కార్తికేయ సింగ్.. కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బీహార్ మంత్రి వర్గంలో మొత్తం 31 మంది మంత్రులు ఉంటే.. 27 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఆర్జేడీ మంత్రులపైనే కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Shyam Singha Roy: ఆస్కార్ బరిలో సాయి పల్లవి చిత్రం..
పార్టీల వారీగా చూస్తే ఆర్జేడీ పార్టీకి చెందిన 17 మంది మంత్రుల్లో 15 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. వీరిలో 11 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. జేడీయూ మంత్రులను క్రిమినల్ కేసులను పరిశీలిస్తే… మొత్తం 11 మంది మంత్రుల్లో నలుగురిపై క్రిమినల్ కేసులున్నట్లు తేలింది. ఇక బీహార్ కేబినెట్ లో భాగంగా ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఇద్దరుంటే ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. గతంలో బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వారిలో 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.