Manipur CM: మణిపూర్ రాష్ట్రంలో ఏడాదిన్నరగా మైటీ- కుకీ జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో అతలాకుతలమవుతూనే ఉంది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు, బాంబు దాడులు, పెద్ద ఎత్తున ఆందోళనలతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం వద్దే బాంబు కన్పించడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, మణిపుర్‌లోని కొయిరెంగేయ్ ప్రాంతంలో సీఎంకు ప్రైవేటు నివాసం ఉంది. ఈ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఈరోజు (డిసెంబర్ 17) తెల్లవారుజామున ఓ మోర్టార్ బాంబును స్థానికులు గుర్తించారు.
Read Also: Blast: అమృత్‌సర్ పోలీస్‌స్టేషన్ దగ్గర పేలుడు కలకలం
దీంతో అలర్టైన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేసేశారు. అయితే, ఈ ఘటన సమయంలో ముఖ్యమంత్రి నివాసంలో లేరని తెలుస్తుంది. ఈ రాకెట్ ప్రొపెల్డ్ బాంబును గత రాత్రి ప్రయోగించి ఉంటారని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు. అది పేలకుండా ఇక్కడ పడిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం ఇంటి దగ్గర భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. దీనిపై వేగవంతమైన విచారణ కొనసాగిస్తున్నారు. బాంబు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు ప్రయోగించారు? అనే కోణంలోను ఎంక్వైరీ చేస్తున్నారు.