Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

  • భారత భవిష్యత్ పాత్రపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
  • ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం
  • హాని చేయాలనే లక్ష్యంతో కాదని హితవు
Mohan Bhagwat

Mohan Bhagwat

భారత భవిష్యత్ పాత్రపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం అని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. తమ దగ్గర సత్యం మాత్రమే ఉంటే సరిపోదని.. ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరమని హితవు పలికారు. అయితే ఒక విషయం ఏంటంటే.. భారత్ ఎవరికీ హాని చేయాలనే లక్ష్యంతో కాకుండా ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే దేశంగా ఎదగాలని సూచించారు.

“ప్రపంచం శక్తివంతుల మాటనే ఎక్కువగా వింటుంది. సత్యం ఒక్కటే సరిపోదు. బలం ఉన్నవారికే గౌరవం లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. శక్తివంతమైన దేశాలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. ఒక దేశాన్ని ఆక్రమించడం, బాంబులు వేయడం, చమురు సరఫరాలను నిలిపివేయడం వంటి చర్యలన్నీ శక్తి ఆధారంగానే జరుగుతున్నాయి. బలహీన దేశాలు మాత్రం వాటికి తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది” అని వ్యాఖ్యానించారు.

×
×
Ad

అయితే భారత్ మాత్రం అలా చేయొద్దని.. అలాంటి లక్ష్యం వద్దని.. ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించమని చెప్పడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. “భారత్ ఎవరినీ అణచివేయాలని కోరుకోవడం లేదు. అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలని.. ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటోంది. తన సొంత విలువలు, సూత్రాల ఆధారంగా బలమైన దేశంగా ఎదిగితే ప్రపంచానికి కొత్త దారిని చూపగలదు” అని అన్నారు. సమాజాన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తులు తీర్చిదిద్దినప్పుడే దేశం నిజమైన శక్తిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానంతో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని.. ఆధిపత్యం ద్వారా కాకుండా ధర్మం, నైతికత ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశంగా ఎదగాలని మోహన్ భగవత్ ఆకాంక్షించారు.