Site icon NTV Telugu

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం.. “మోడీ..మోడీ” అంటూ నినాదాలు.

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీలో ఇంద్రప్రస్థ యూనివర్సిటీ(ఐపీ యూనివర్సిటీ) కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి చేదు అనుభవం ఎదురైంది. గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ తూర్పు ఢిల్లీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్న క్రమంలో అక్కడ ఉన్న విద్యార్థులు మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన గురువారం జరిగింది. దీనికి ప్రతిస్పందనగా కేజ్రీవాల్ చిరునవ్వుతో స్పందిస్తూ.. నేను చెప్పేది 5 నిమిషాలు వినాలని, చేతులు జోడించి అభ్యర్థిస్తున్నానని, మీకు నచ్చకపోతే, మీరు ఆ తర్వాత నినాదలు చేయడం కొనసాగించవచ్చని ఆయన అన్నారు.

Read Also: Monsoon: ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా వర్షాలు..

ఇలాంటి నినాదాలు చేయడం ద్వారా విద్యావ్యవస్థ మెరుగుపడి ఉంటే, గత 70 ఏళ్లలో జరిగి ఉండేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు గొడవకు పాల్పడ్డారని ఆరోపించింది. నా ఆలోచనలు మీకు నచ్చకపోవచ్చని నాకు తెలుసు.. మీరు వ్యాఖ్యలు చేయవచ్చు కానీ ఇలా చేయడం సరైంది కాదని, ఈ రోజు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషిని కూడా కొంతమంది ఎగతాళి చేశారు. దీనికి ప్రతిగా అతిషి మాట్లాడుతూ..‘‘ ఇందుకే విద్య అవసరం’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.

ప్రారంభోత్సవ వేడుక జరుగుతున్నప్పుడు క్యాంపస్ వెలుపల ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య నినాదాలు చోటు చేసుకున్నాయి. గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం యొక్క తూర్పు ఢిల్లీ క్యాంపస్ ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి వివాదాస్పదంగా మారింది. కొత్తగా నిర్మించిన క్యాంపస్ ని తామే ప్రారంభిస్తామని ఇరుపక్షాలు పేర్కొంటున్నాయి. క్యాంపస్ నిర్మాణ క్రెడిట్ తీసుకునేందుకు ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి.

Exit mobile version