Monsoon: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. వారం ఆలస్యం కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాన్ రుతుపవనాలను ప్రభావితం చేస్తాయని, కేరళపై దీని ప్రభాంత తక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగానే చెప్పారు. సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళకు చేరాలి. అయితే ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న కేరళకు చేరుతాయని ముందుగా అంచనా వేసినప్పటికీ.. మొత్తంగా వారం రోజుల ఆలస్యం తరువాత ఇండియా మెయిన్ ల్యాండ్ లోకి ప్రవేశించాయి.
రుతుపవనాల ఎంట్రీతో కేరళ తీరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు విస్తరించిన రుతుపువనాలు 48 గంటల్లో కేరళలోని అన్ని ప్రాంతాలకు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరో వారం-10 రోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉంది.
Read Also: Agni Prime Ballistic Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. అగ్ని ప్రైమ్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్..
ఐఎండీ డేటా ప్రకారం గత 150 ఏళ్లలో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే తేదీ మారుతూ వస్తోంది. 1918లో మే 11న రుతుపవనాలు అత్యంత ముందుగా రుతుపవనాలు వస్తే.. 1972లో జూన్ 18న అత్యంత ఆలస్యంగా కేరళలోని ప్రవేశించాయి. గత ఏడాది మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2019లో జూన్ 8న, 2018లో మే 29న రుతుపవనాలు వచ్చాయి.
రుతుపవనాలు భారతదేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈసారి రుతపవనకాలంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. భారత్ లో ఈ సారి సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాయువ్య భారతదేశంలో సాధారణం నుండి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు మరియు ఈశాన్య, మధ్య మరియు దక్షిణ ద్వీపకల్పంలో దీర్ఘకాల సగటులో 94-106 శాతం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సగటు 90 శాతం కంటే తక్కువగా ఉంటే లోటు వర్షపాతంగా.. 90-95 శాతం మధ్య ఉంటే సాధారణ కన్నా తక్కువగా, 105-110 శాతం ఉంటే సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతంగా లెక్కగడుతారు.