Site icon NTV Telugu

Udhayanidhi Stalin: “సనాతన ధర్మాన్ని నిర్మూలించండి”.. స్టాలిన్ కొడుకు వివాదాస్పద వ్యాఖ్యలు..

Udayanidhi Stalin

Udayanidhi Stalin

Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని శనివారం అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ‘సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటది, దీన్ని నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. బీజేపీ పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తమిళనాడు మంత్రిపై కేసు పెట్టాలని పలువురు పిలుపునిచ్చారు. సీఎం స్టాలిన్, డీఎంకే పార్టీ వారసుడిగా పేరు సంపాదించుకున్న ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది. ‘డీఎంకే వారసుడు సనాతన ధర్మాన్ని రూపుమాపడం గురించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ మౌనమే ఈ జాతి విధ్వంసక పిలుపుకు మద్దతు ఇస్తోందని, పేరుకు తగ్గట్లే ఇండియా కూటమికి అవకాశం ఇస్తే వేల ఏళ్ల నాగరితకను నిర్మూలిస్తుందని’ బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Read Also: Bhaganvanth Kesari : యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ గా నిలిచిన గణేష్‌ ఆంథమ్‌..

చెన్నైలో జరిగిన రచయితల సదస్సులో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనే ఆలోచన తిరోగమనమైందని, దీన్ని వ్యతిరేకించడం సాధ్యం కాదని, నిర్మూలించడమే పరిష్కారం అని అన్నారు. ఇది కులం, లింగ ప్రాతిపదికన ప్రజలను విభజిస్తోందని, సమానత్వ, సామాజిక న్యాయానికి ప్రాథమికంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. తాను మాట్లాడిన ప్రతీ మాటకు కట్టుబడి ఉంటానని ఉదయనిధి సమర్థించుకున్నారు. సనాతన ధర్మం సమాజంపై ప్రతికూలం ప్రభావంపై అంబేద్కర్, పెరియార్ చేసిన రచనల్ని ఏ వేదికలోనైనా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అనేెక సాంఘిక దురాచారాలకు సనాతన ధర్మమే కారణం అంటూ వ్యాఖ్యానించారు. న్యాయస్థానంలో, ప్రజాకోర్టులో ఎదరయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. క్రైస్తవ మిషనరీల ఆలోచనలను ఉదయనిధి స్టాలిన్‌, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌లు చెబుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు.

Exit mobile version