MK Stalin: జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా, హిందీ భాష విధింపుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఈ వివాదమే 20 ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసేందుకు సాయపడింది. బీజేపీ ‘హిందీ’ని మరాఠీ ప్రజలపై విధిస్తోందని ఆరోపించారు. అయితే, ఈ విధానంపై వ్యతిరేకత రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ తన ఉత్తర్వులను ఉపసంహరించుకున్న తర్వాత, ఠాక్రేలు ఇద్దరు కలిసి విజయోత్సవ సభ నిర్వహించారు.
శనివారం ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ ర్యాలీని నిర్వహించారు. 2005 తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు ఒకే వేదిక పైకి వచ్చారు. తాము ఇకపై కలిసే ఉంటామని చెప్పారు. తమ మధ్య దూరం తొలిగిందని ప్రకటించారు. ఈ కలయికను తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న ద్విభాషా-తమిళం, ఇంగ్లీష్ అమలులో ఉంది. అయితే, బీజేపీ ప్రభుత్వం హిందీని తమిళనాడుపై విధిస్తోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు.
Read Also: Velampalli Srinivas: చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలపండి..
శనివారం ర్యాలీ తర్వాత ఎక్స్‌లో స్టాలిన్ కీలక పోస్ట్ పెట్టారు. భాషా హక్కుల కోసం పోరాటం రాష్ట్ర సరిహద్దులను దాటిందని, మహారాష్ట్రలో ఊపు కనిపిస్తోందని ఆయన అన్నారు. ‘‘హిందీ విధించడాన్ని ఓడించడానికి డీఎంకే, తమిళనాడు ప్రజలు తరతరాలుగా సాగుతున్న భాషా హక్కుల పోరాటం ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులను దాటింది. మహారాష్ట్రలో నిరసన తుఫానులా ఎగిసిపడుతుంది’’ అని స్టాలిన్ అన్నారు.
‘‘తమిళనాడు పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా బోధిస్తేనే నిధులు కేటాయిస్తామని పేర్కొంటూ చట్టవిరుద్ధంగా మరియు అరాచకంగా వ్యవహరించే బిజెపి, వారు అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ప్రజల తిరుగుబాటు భయంతో రెండవసారి వెనక్కి తగ్గవలసి వచ్చింది’’ అని స్టాలిన్ అన్నారు.