Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాన్ ‘బిపార్జాయ్’ గుజరాత్ తీరం వైపు వస్తోంది. గురువారం సాయంత్రం గుజరాత్ తీరాన్ని తాకనుంది. గుజరాత్ లోని తీర ప్రాంత జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ నష్టాన్ని కలుగచేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరప్రాంతంలోని దాదాపు లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు మోహరించాయి.
ఇదిలా ఉంటే తుఫాన్ వేళ పుట్టిన ఓ పాపకు ఇప్పుడు ఈ తుఫాన్ పేరే పెట్టారు. గతంలో కూడా కొన్ని సార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. తుఫాన్ సమయంలో పుట్టిన పిల్లలకు ఆ తుఫాన్ పేర్లనే పెట్టడం మనం చూశాం. తాజాగా గుజరాత్ లోని జంట నెల రోజుల వయసు ఉన్న తమ కుమార్తెకు ‘బిపార్జాయ్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ కుటుంబం కచ్ జిల్లాలోని జఖౌలో షెల్టర్ హౌస్ లో ఉంది. తుఫాన్ నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో.. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందులో ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు.
గతంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేర్లతో పిల్లలకు పేర్లు పెట్టారు. తిత్లీ, ఫణి, గులాబ్ వంటి పేర్లను పిల్లలకు పెట్టుకున్నారు. ప్రస్తుతం ‘బిపార్జాయ్’ తుఫాన్ పేరును బంగ్లాదేశ్ పెట్టింది. దీని అర్థం ‘విపత్తు’. గతంలో కూడా కొన్ని విపత్తుల పేర్లతో పిల్లలకు నామకరణం చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ లో ఓ నవజాత శిశువుకు కరోనా అని పేరు పెట్టారు. ఏపీలోని కడప జిల్లాలో కూడా ఇద్దరు పిల్లలకు కరోనా అని పేరు పెట్టారు.