పెళ్లి సంబంధం చూసి.. ఓ ఇంటి వాడిని చేసి.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదించిన ఓ బ్రోకర్ హత్యకు గురయ్యాడు. సంబంధం చూసి పెళ్లి చేసిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అలా చేయడమే తనకు మరణశాసనం అవుతుందని అతడు ఊహించలేకపోయాడు. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న కోపంతో పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ భర్త. ఈ ఘోరం కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Off The Record: వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని పూర్తిగా మరిచిపోయినట్లేనా..?
వామంజూర్ నివాసి అయిన సులేమాన్ (50), ముస్తఫా (30) అనే యువకుడికి పెళ్లి సంబంధం చూశాడు. 8 నెలల క్రితం షహీనాజ్ అనే మహిళతో ముస్తఫా (30)కు వివాహం జరిపించాడు. అయితే పెళ్లైన నాటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో షహీనాజ్ రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవడంతో ముస్తఫా.. పెళ్లి బ్రోకర్ సులేమాన్‌పై కోపం పెంచుకున్నాడు. బుధవారం రాత్రి ముస్తఫా.. సులేమాన్‌కు అసభ్యకరమైన ఫోన్ కాల్ చేశాడు. దీంతో సులేమాన్, అతని కుమారులు రియాబ్, సియాబ్‌లతో కలిసి వలచిల్‌లోని ముస్తఫా ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఏం వాగ్వాదం జరిగిందో.. ఏమో తెలియదు గానీ.. వెళ్లిపోయే ముందు సులేమాన్ చర్చ విఫలమైందని సూచించి బయటకు వెళ్లిపోతుండగా అకస్మాత్తుగా ముస్తఫా కత్తితో పరిగెత్తుకుంటూ వచ్చి సులేమాన్ మెడపై వేటువేశాడు. అంతే అక్కడికక్కడే సులేమాన్ ప్రాణాలు వదిలాడు. అక్కడే ఉన్న ఇద్దరు కుమారులపై కూడా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు ముస్తఫా అక్కడ నుంచి పారిపోయాడు.
ఇది కూడా చదవండి: NIA: పేలుళ్ల కుట్ర కేసులో కూపీ లాగుతున్న ఎన్‌ఐఏ.. ఏ నగరాలను టార్గెట్ చేసారు..?
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని రాత్రి 11 గంటల ప్రాంతంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించగా సులేమాన్ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఇద్దరు కుమారులు మాత్రం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళూరు గ్రామీణ పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 లోని నేరపూరిత హత్య, హత్యాయత్నం మరియు దాడితో సహా బహుళ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ముస్తఫాను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
