Manipur Violence: గత నాలుగు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మెయిటీ, కుకీల మధ్య జాతి ఘర్షణల కారణంగా 175 మంది మరణించారు. చాలా మంది సొంత ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పరిస్థితి శాంతియుతంగా మారుతుందనుకునే సమయంలోనే మళ్లీ అల్లర్లు మొదలువుతున్నాయి. ఇటీవల ఇద్దరు మెయిటీ విద్యార్థులను మిలిటెంట్లు చంపడం మరోసారి ఆ రాష్ట్రంలో విధ్వంసానికి కారణమైంది. ఏకంగా సీఎం బీరెన్ సింగ్ ఇంటిపైనే ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు.
ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో కొందరు కుట్రకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మణిపూర్ కి చెందిన ఓ అనుమానితుడిని ఎణ్ఐఏ అరెస్ట్ చేసింది. ఇతను బంగ్లాదేశ్, మయన్మార్ లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకుని కుట్రకు పాల్పడుతున్నడని తెలుస్తోంది. ఇలా అంతర్జాతీయ కుట్రకు పాల్పడున్న వ్యక్తిని చురచంద్‌పూర్ లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడితో పాటు అతని నెట్‌వర్క్ మణిపూర్ సంక్షోభాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందని ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది.
Read Also: Aditya-L1: కీలక మైలురాయిని దాటిన ఆదిత్య ఎల్1.. భూమి ప్రభావాన్ని తప్పించుకుని ఎల్1 దిశగా ప్రయాణం..
సీమిన్లున్ గాంగ్టే అనే వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మయన్మార్, బంగ్లాదేశ్ ఆధారిత ఉగ్రవాద సంస్థల నాయకత్వంలో కుట్ర పన్నడంలో కీలకపాత్ర పోషించాడని, మణిపూర్ లో అశాంతికి పెంచడానికి ప్రయత్నించాడని ఎన్ఐఏ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. జూన్ 22న మణిపూర్ లోని క్వాక్తాలో ఒక వ్యక్తిని చంపిన కారుబాంబు పేలుడు కేసులో గాంగ్టే ప్రధాన నిందితుడు. ఓ స్కార్పియోలో బాంబులు అమర్చి చిన్న బ్రిడ్జ్ వద్ద పేల్చాడు. ఈ దాడి ఉగ్రవాదుల చేసినట్లుగా కనిపించింది. అయితే గాంగ్టేకు ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందో ఇంకా ఎన్ఐఏ తెలియజేయలేదు.
దాదాపుగా 25 కుకీ మిలిటెంట్ గ్రూపులు చురచంద్‌పూర్ లో ఉన్నాయి. ఇవన్నీ గతంలో కేంద్రం, రాష్ట్రం, మిలిటరీతో త్రైపాక్షిక సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్(SoO) ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే ఈ ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని గ్రూపులు ఇప్పుడు మణిపూర్ సంక్షోభానికి కారణమవుతున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ మిలిటెంట్ గ్రూపులు భారత్ లోని జాతుల మధ్య చీలిక తీసుకువచ్చి, హింసాత్మక సంఘటనల్లో పాల్గొనే విధంగా భారత్ లోని మిలిటెంట్ నాయకులతో కుట్ర పన్నుతున్నారని దర్యాప్తులో తేలింది.
మణిపూర్ రాష్ట్రంలో మే 3న ప్రారంభమైన తెగల మధ్య గొడవ ఇప్పటికీ సద్దుమణగడం లేదు. మెయిటీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని కోరడాన్ని కుకీ తెగ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో 10 శాతం భూభాగంలో 50 శాతానికి పైగా మొయిటీలు ఉంటే, మిగిలిన 90 శాతం భూభాగంలో మైనారిటీలు అయిన కుకీలు ఉన్నారు. ఈ వివాదంతోనే మెయిటీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని కోరుతుండటం వివాదస్పదం అయింది. దీనికి తోడు భారత బాహ్యశక్తులు కూడా మణిపూర్ సంక్షోభానికి కారణం అవుతున్నాయి.