NTV Telugu Site icon

TMC: రచ్చకెక్కిన తృణమూల్ ఎంపీలు, వాట్సాప్ చాట్ లీక్.. మమతా బెనర్జీ సీరియస్.. ఎంపీల మధ్య ఏంటీ వివాదం..?

Kalyan Banerjee

Kalyan Banerjee

TMC: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీల మధ్య గొడవలు రచ్చకెక్కాయి. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, మహువా మోయిత్రా, కీర్తి ఆజార్ మధ్య వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, బీజేపీ నేత అమిత్ మాల్వియా వీరి మధ్య గొడవల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పరిస్థితి విషమించడంతో తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మహువా మోయిత్రాకు మమతా బెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నివేదికల ప్రకారం, టీఎంసీ సీనియర్ రాజ్యసభ ఎంపీ ద్వారా ఈ హెచ్చరికలు మహువా మోయిత్రాకు చేరినట్లు సమాచారం. మరింత అంతరాయం కలిగించేలా ప్రవర్తించవద్దని మోయిత్రాను ఆదేశించారు. కట్టుబడి ఉండకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

Read Also: Registrations : సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధునికత.. త్వరితగతిన రిజిస్ట్రేషన్లకు కీలక నిర్ణయం

వివాదం ఎలా మొదలైంది..?

మోయిత్రా, కళ్యాణ్ బెనర్జీల మధ్య ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా లోక్‌సభలో మాట్లాడే విషయమై, పార్టీ తరుపున తనకు బెనర్జీ సమయం కేటాయించడం లేదని మోయిత్రా చాలా కాలంగా కోపంగా ఉంటోదని తెలుస్తోంది. టీఎంసీ ఎంపీలకు సభా సమయాన్ని కేటాయించే బెనర్జీ తనకు తక్కువగా చూస్తున్నాడని, వివిధ అంశాలపై మాట్లాడే అవకాశాలను నిరాకరిస్తున్నాడని మోయిత్రా ఆగ్రహంగా ఉంది.

దీనికి మరింత ఆజ్యం పోస్తూ, పార్టీ లోపల, బయట కళ్యాణ్ బెనర్జీకి పెరుగుతున్న ప్రాముఖ్యతపై ఆమె భయపడుతున్నట్లు సమాచారం. ఇదే ఈ మొత్తం వివాదానికి కారణమైంది. మోయిత్రా కళ్యాణ్ బెనర్జీ, ఆమె కూతురు గురించి దుర్భాషలాడినట్లు, బెంగాలీలో అవమానకరమైన ‘‘ఛోటో లోక్(దిగజారుడు వ్యక్తి)’’ అని తిట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో కళ్యాణ్ బెనర్జీ, కీర్తి ఆజాద్ మధ్య వివాదాన్ని ఎక్స్ వేదికగా ప్రజల ముందు ఉంచారు. వీరిద్దరికి వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు, స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. దీంతో పాటు కళ్యాణ్ బెనర్జీ, మహువా మోయిత్రా మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు.

ఏప్రిల్ 04న భారత ఎన్నికల కమిషన్ (ECI) ప్రధాన కార్యాలయంలో కీర్తి ఆజాద్, కళ్యాణ్ బెనర్జీల మధ్య వాడీవేడీ వాగ్వాదం జరిగింది. మెమోరాండం సమర్పించడానికి వెళ్లిన సమయంలో గొడవ జరిగినట్లు మాల్వియా ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

మరోవైపు, పార్టీ వాట్సాప్ గ్రూప్ చాట్‌ని బీజేపీకి టీఎంసీ నేత సౌగత రాయ్ లీక్ చేసినట్లు కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ఈసీఐ కార్యాలయంలో ఎంపీలు సంకతం చేసిన మెమోరాండంపై మహువా మోయిత్రా సంతకం లేకపోవడంపై కళ్యాణ్ బెనర్జీని ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగా తన పేరు లేకుండా చేసినట్లు ఆరోపించడంతో వీరిద్దరి మధ్య గొడవ పెద్దదైంది చివరకు కళ్యాణ్ బెనర్జీని బీఎస్ఎఫ్ అరెస్ట్ చేయాలని మోయిత్రా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు కళ్యాణ్ బెనర్జీ మహువా మోయిత్రాను మొరటు మహిళా ఎంపీ అని అన్నట్లు తెలుస్తోంది. కీర్తి ఆజాద్ మోయిత్రాకు సపోర్టు చేసినట్లు తెలుస్తోంది.