కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక వైద్యులకు భద్రత కల్పించాలంటూ గత కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్ష చేస్తు్న్నారు. వీరికి మద్దతుగా సీనియర్ డాక్టర్లు కూడా రాజీనామాలు కూడా సమర్పించారు. అయితే ఈ రాజీనామాలను ప్రభుత్వ తిరస్కరించింది. అయితే జూడాల దీక్షపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. వైద్యులు దీక్షను వీడాలని కోరారు. డాక్టర్ల నిరసనలతో పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపారు. నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని.. వైద్య సేవలపై ప్రభావం పడకూడదని చెప్పారు. వైద్యుల డిమాండ్లలో కొన్ని ఇప్పటికే నెరవేర్చామని.. మిగతా వాటి కోసం 3-4 నెలల సమయం ఇవ్వాలని వైద్యులను మమత కోరారు. ఈ విషయంపై చర్చించేందుకు మరోసారి చర్చలకు రావాలని ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: KTR : గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వం
జూనియర్ డాక్టర్లు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సోమవారం (21-10-2024) రావాలని మమత మరోసారి ఆహ్వానించారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రి దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ వైద్యుల వేదిక దగ్గరకు శనివారం చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వెళ్లారు. ఈ సమయంలో సీఎం వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. వైద్యులు చేసిన పలు డిమాండ్లను నెరవేర్చడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను ప్రభుత్వానికి వైద్యులు నిర్దేశించడం సరికాదని వ్యాఖ్యానించారు. వైద్యుల డిమాండ్లపై చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వేలో సిబ్బంది కొరత.. రిటైర్డ్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్!
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత ఘోరంగా హత్యాచారం జరిగింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు కొనసాగించారు. సీఎం మమతా బెనర్జీ తమ డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇవ్వడంతో.. 42 రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gaddam Prasad: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్పీకర్.. బలగం సినిమా ఫేమ్ కు ఆర్థిక సహాయం!