త్వరలోనే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇక ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ నువ్వానేనా? అన్నట్టుగా ఢీకొంటున్నాయి. ఒకరేమో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తాపత్రాయం పడుతుంటే.. ఇంకొకరేమో అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక వర్గం ఓటు బ్యాంక్ కోసం మాస్టర్ ప్లానే వేసినట్లుగా తెలుస్తోంది. ముస్లిం నేతృత్వంలోని ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీ ఓట్లను పొందుతోంది. అయితే ఈ మధ్య టీఎంసీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముర్షిదాబాద్‌లోని బెల్దంగాలో జాతీయ రహదారి 12 వెంబడి బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించడం వెనుక ఉన్న ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను సస్పెండ్ చేసింది. అతడు జనతా ఉన్నయన్ పార్టీ (JUP) పేరుతో కొత్త పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ముస్లింలంతా అధికార పార్టీ నుంచి వైదొలగాలని బహిరంగంగా పిలుపునిస్తున్నారు.
అయితే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని వారాలే మిగిలి ఉండగా వారి ఓటు బ్యాంక్‌ను పోగొట్టుకోకూడదని మమత భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ముస్లింల నేతృత్వంలోని రాజకీయ సంస్థల మధ్య ఒక మైనారిటీ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఈ ఫ్రంట్ ఏర్పాటు వల్ల మమతా బెనర్జీ తిరిగి ముస్లింల ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవచ్చు. అంతేకాకుండా అధికారాన్ని కాపాడుకోవచ్చు. తిరిగి నాలుగోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ముస్లింల ఓటు బ్యాంక్ కోసం మమత తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ జనాభాలో ముస్లింలు దాదాపు 27 శాతం ఉన్నారు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్, బిర్భూమ్, నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు వంటి జిల్లాల్లో మైనారిటీ ఓటర్లు ఫలితాలను నిర్ణయాత్మకంగా మార్చగల డజన్ల కొద్దీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలే టీఎంసీకి అఖండ విజయాలను అందించాయి. మాల్డాలో ఆ పార్టీ ఓట్ల శాతం 2021లో 53 శాతానికి పెరిగింది. ముర్షిదాబాద్‌లో అదే కాలంలో ఆ పార్టీ ఓట్ల వాటా 6 శాతం నుంచి 54 శాతానికి పెరిగింది. రెండు జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో టీఎంసీ ప్రస్తుతం 28 సీట్లను కలిగి ఉంది. ఉత్తర దినాజ్‌పూర్‌లో ఆరు సీట్లలో నాలుగు సీట్లను ఆ పార్టీ నియంత్రిస్తోంది.
బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 100 సీట్లలో ముస్లింలు ప్రభావితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మమత ప్రయత్నిస్తున్నారు. దూరమైన ముస్లింలను దగ్గరకు తీసుకుని.. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
