Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రవీంద్రనాథ్ ఠాగోర్ జయంతిని పురస్కరించుకుని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బీజేపీ నియంతృత్వ పోకడలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఠాగోర్ జయంతి వేడుకల నిర్వహణలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మమత ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాళీఘాట్ కూడలి, ముక్తదల్ వంటి ప్రాంతాల్లో వేడుకలకు అనుమతి కోరగా అధికారులు నిరాకరించారని ఆమె ఆరోపించారు. “ఇది టీఎంసీ గొంతు నొక్కే ప్రయత్నం. అందుకే పార్టీ కార్యాలయం బయటే జయంతిని నిర్వహిస్తున్నాం. మాతృభూమిని ప్రేమించే వారు భయం లేకుండా ఏకమవ్వాలి” అని ఆమె వ్యాఖ్యానించారు.
బెంగాల్‌లో భయంకర పాలన
రాష్ట్రంలో బీజేపీ వేధింపులు పెరిగిపోయాయని, దళితులు, మహిళలను కూడా వదలడం లేదని మమత ఆరోపించారు. తనతో ఉండే 92 ఏళ్ల వృద్ధురాలు వేధింపుల భయంతో ఇల్లు వదలాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన వధువులను కూడా ఇంటి నుంచి పంపిస్తున్నారని, పార్టీ కార్యకర్తల ఇళ్ల వద్ద గూండాయిజం జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేబ్ భట్టాచార్య భద్రత విషయంలో బీజేపీ తీరును ఆమె తప్పుబట్టారు. “నేను అధికారంలోకి వచ్చినప్పుడు బుద్ధదేబ్‌కు గౌరవం ఇచ్చాను, నా సొంత బుల్లెట్‌ప్రూఫ్ కారును ఆయన కోసం పంపాను. కానీ బీజేపీ అధికారంలోకి రాగానే ఆయనకు ఉన్న జెడ్ ప్లస్ సెక్యూరిటీని, ఇతర సేవలను తొలగించింది” అని ఆమె గుర్తు చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో జాతీయ స్థాయి నాయకులంతా తనతో ఉన్నారని మమత స్పష్టం చేశారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ వంటి నేతలతో మాట్లాడినట్లు ఆమె వెల్లడించారు. కపిల్ సిబల్ వంటి సీనియర్ న్యాయవాదులు కూడా మద్దతు ప్రకటించారని, తానే స్వయంగా న్యాయవాదిగా ఈ యుద్ధంలో ముందుంటానని పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఢిల్లీ వెళ్తుండగా విమానాశ్రయంలో వేధింపులకు గురయ్యారని మమత వెల్లడించారు. ఎన్నికల రిగ్గింగ్‌కు పాల్పడిన వారే ఆమెను వేధించారని, దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ రాజకీయ, నైతిక పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా దీదీ స్పష్టం చేశారు.
