NTV Telugu Site icon

Opposition Meeting: ఈ నెల 17-18న బెంగళూర్ వేదిక విపక్షాల భేటీ.. ఖర్గే ఆహ్వానం..

Opposition Meeting

Opposition Meeting

Opposition Meeting: గత నెలలో పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల భేటీ జరిగింది. ముందుగా సిమ్లా వేదిక రెండోసారి ప్రతిపక్షాలు భేటీ కావాలని అనుకున్నాయి. అయితే ఈ వేదికను బెంగళూర్ కి మార్చారు. ఈ నెల 17-18 తేదీల్లో బెంగళూర్ వేదికగా రెండోసారి విపక్షాల భేటీ జరగబోతోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో మోడీని, బీజేపీ అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో విపక్షాలు అన్నీ ఐక్యంగా పోరాడాలని అనుకుంటున్నాయి. మొదటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆర్జేడీ, టీఎంసీ, జేడీయూ, ఆప్ పార్టీలతో పాటు 15 పార్టీలు సమావేశానికి హాజరై ఉమ్మడిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి.

Read Also: Ponnala Lakshmaiah : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు

ఇదిలా ఉంటే బెంగళూర్ లో జరిగే భేటీకి హాజరు కావాల్సిందిగా ఎన్డీయేతర విపక్షాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానం పలికారు. జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో జరిగిన విపక్ష సమావేశంలో తాము పాల్గొన్న విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిపక్ష పార్టీ అగ్ర నేతలకు రాసిన లేఖలో గుర్తు చేశారు. పాట్నా సమావేశంలో మన ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే వివిధ అంశాలపై చర్చించామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేందుకు ఏకగ్రీవంగా అంగీకారానికి వచ్చాము కాబట్టి ఈ సమావేశం విజయవంతమైందని ఖర్గే తన ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. జులైలో మరోసారి సమావేశం కావడానికి మేము ఇంకా అంగీకరించామని కాంగ్రెస్ అధ్యక్షుడు నాయకులకు గుర్తు చేశారు. విపక్షాల ఐక్యతను కొనసాగించేందుకు జూలై 17-18 తేదీల్లో సమావేశాలు జరుగుతాయని ఆయన అన్ని విపక్షాలకు ఆహ్వానం పంపారు.

గతంలో పాట్నాలో జరిగిన సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ హాజరయ్యారు. బెంగళూర్ లో జరిగే సమావేశంలో ఏ విధంగా పోటీ చేద్ధాం..? సీట్ల పంపకాల విషయం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.